కేసీఆర్, మజ్లిస్ లతో రాహుల్ ‘ఎన్ కౌంటర్’.

ఎస్.కె.జకీర్.

టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మజ్లిస్ పార్టీలను రాహుల్ గాంధీ కడిగిపారేశారు. వీరి బంధాన్ని నిలదీశారు. బిజెపి, మజ్లిస్, టిఆర్ఎస్ ఒకే తాను ముక్కలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీకి ఎంఐఎం ఎందుకు మద్దతు ఇస్తోందని ఆయన శనివారం సాయంత్రం ప్రశ్నించారు. బిహార్‌ సహా అన్ని చోట్లా బీజేపీకి ఎంఐఎం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. మహిళలు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారని, దేశంలో మహిళలు, మైనార్టీలకు రక్షణ కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో విద్వేషాలురగిల్చేందుకుమోదీ ప్రయత్నిస్తున్నారని, ఈ దేశం అందరిదీఅనిగుర్తించాలన్నారు.బిజెపి, మజ్లిస్ పార్టీలు ఒకే ‘ఆలోచన ధార’తో పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశాన్ని ముక్కలు చేయడం, మాత సామరస్యాన్ని దెబ్బతీయడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల్ని మతం పేరిట విభజించడం… వంటి విషయాల్లో బిజెపికి, మజ్లీస్ కు ఎలాంటి తేడాలేదన్నారు. గతంలో చార్మినార్‌కు రాజీవ్‌గాంధీ వచ్చారని, అందుకే ఇప్పుడు సద్భావన యాత్ర నిర్వహించామని రాహుల్ తెలిపారు. మోదీ పిచ్చి నిర్ణయాల్లో నోట్లరద్దు ఒకటి అని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నోట్ల రద్దుకు సీఎం కేసీఆర్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు ఎంఐఎం అండగా నిలిచిందన్నారు. నోట్ల రద్దు తర్వాత కూలైన్లలో మాల్యా, నీరవ్‌, అనిల్‌ నిలబడ్డారా? నోట్ల రద్దుతో దోపిడీ దారులు నల్లధనాన్ని తెల్లధనంగామార్చుకున్నానిఅని రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు.తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు.

కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదని, ఐదేళ్లలో తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే బాగుపడిందన్నారు. హైదరాబాద్ పాతబస్తికి మెట్రో రాలేదని, మెట్రో వస్తే రాత మారుతుందని చిన్న వ్యాపారులు ఆశించారని, రూ.300 కోట్లు పెట్టి కట్టుకున్న కేసీఆర్‌ ఇల్లు ఒక్కటే పూర్తయినట్టు విమర్శించారు. సావర్కర్‌ లాంటి వారి విగ్రహాలు పార్లమెంట్‌లో పెడతారాఅంటూ బిజెపిని ప్రశ్నించారు. పైగా ‘వీర్‌ సావర్కర్‌’ అని పేరు రాయిస్తారాఅనినిలదీశారు.గాంధీజీతో పాటు మిగతా కాంగ్రెస్‌ నేతలు జైల్లో ఉన్నప్పుడు బ్రిటీష్‌ వాళ్లకు సావర్కర్‌ లేఖ రాశారని గుర్తుచేశారు. జైలు నుంచి వదిలేయాలని బ్రిటీష్‌ వాళ్లని సావర్కర్‌ వేడుకున్నారని, కాళ్లు పట్టుకుంటా, మీరు చెప్పినట్టు చేస్తానని సావర్కర్‌ ప్రాధేయపడ్డాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తి మోదీ దృష్టిలో వీరుడా అంటూ రాహుల్‌ నిలదీశారు.ఆత్మగౌరవంతో ఉండే యువకులు, రైతులను అవమానిస్తారని, సావర్కర్‌ లాంటి వాళ్ల విగ్రహాలు పార్లమెంట్‌లో పెడతారా? ఇదేం దేశభక్తి అనిప్రశ్నించారు.మజ్లిస్, కాంగ్రెస్ ల మధ్య చాలాకాలం స్నేహం కొనసాగింది. ఇప్పుడు మజ్లిస్ పార్టీ కేసీఆర్ తో చేతులు కలిపింది. కాంగ్రెస్ తో శత్రుపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనతో విబేధాలు ఏర్పడ్డాయి. కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి, అటు యుపిఏ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఎంఐఎం, టిఆర్ఎస్ ల మధ్య మైత్రి వికసించింది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. దీనికి తోడు అసదుద్దీన్ శనివారం కాంగ్రెస్, బిజెపి జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, అమిత్ షా కానీ తనపై పోటీ చేయాలంటూ ట్విట్టర్ వేదికగా చేసిన సవాలు తాజా పరిస్థితిపై మరింత ఆజ్యం పోసినట్లయింది. ”చార్మినార్‌కు వస్తున్నందుకు రాహుల్‌ గాంధీకి స్వాగతం. మా నగరం అందరినీ గౌరవిస్తుంది. మీరు(రాహుల్‌ గాంధీ), బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఇక్కడి నుంచి పోటీచేయాల్సిందిగా కోరుతున్నాము. భిన్న జాతుల సంస్కృతి అంటే ఏమిటో ఇక్కడి ప్రజలు మీకు చూపిస్తారు. దోస్తులయినా, శత్రువులైనా అందరికీ హైదరాబాద్‌ స్వాగతం పలుకుతుంది’ అంటూఓవైసీట్వీట్‌ చేశారు.ఉద్దేశపూర్వకంగానే అసద్ ఈ ‘ట్వీట్’ చేసినట్టు భావించవలసి వస్తున్నది. “విశ్వహిందూపరిషత్, అర్.ఎస్.ఎస్, బిజెపిల కన్నా కెసిఆర్ కు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ధార్మిక విశ్వాసాలను బహిరంగంగా ప్రకటిస్తున్నారు. బిజెపి, ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు కూడా చేయని విధంగా ఆలయాలు నిర్మిస్తున్నారు.యాగాలుచేస్తున్నారు.అందువల్ల బిజెపి హిందుత్వ నినాదం తెలంగాణా లో పని చేయదు.” అని కెసిఆర్ కుమారుడు, మంత్రి కేటిఆర్ గత ఆగస్టులో మీడియాకు చెప్పారు.

అంటే కేసీఆర్, ఆయన కుమారుడు, టిఆర్ఎస్ పార్టీ ‘సంక్షోభ పరిష్కర్త’ కేటీఆర్ ఇటు ముస్లిం మైనారిటీలను, అటు హిందూ సంప్రదాయ ఓటు బ్యాంకులను ఏకకాలంలో బుజ్జగించే పనిలో ఉన్నట్టు అర్ధమవుతున్నది.బిజెపి,ఎం.ఐ.ఎం రెండూ మ‌త‌త‌త్వ పార్టీలుగా ముద్ర పడినవే.రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని బహిరంగం చేశారు. ఆ రెండు పార్టీలతోనూ కెసిఆర్ అనుకూలంగా ఉన్నారన్నది టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కొన్ని నెలలుగా ఆరోపిస్తూనే ఉన్నారు. టిపిసిసి నాయకులు ఇచ్చిన ‘ఇన్ పుట్స్’ ఆధారం చేసుకునే రాహుల్ మజ్లిస్ పై చెలరేగినట్టు కనిపిస్తున్నది. “ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంటులో భీకరంగా పోరాడతాం. ఈ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లును పంపాం. కేంద్ర ప్రభుత్వానికి కాస్త సమయమివ్వాలన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లు వేచిచూశాం. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. తొమ్మిదో షెడ్యూల్‌లో చేరితేనే రిజర్వేషన్లకు రక్షణ దొరుకుతుంది. అందుకు ప్రధాని సుముఖంగా ఉన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ సహకారం తీసుకుంటాం. ముస్లింలకు కాంగ్రెస్‌ 4 శాతం రిజర్వేషన్‌ తెచ్చింది. ఎవరు మంచి చేసినా ఆ పేరు ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ గత ఏడాది నవంబర్ లో శాసనసభలో చెప్పారు. అయితే ముస్లింలు, ఎస్.టి. రిజర్వేషన్ల వ్యవహారంలో ఒక్క అడుగు ముందుకు పడకపోయినా మజ్లీస్ పార్టీ మాత్రం నోరు మెదపడం లేదు.బిజెపికి,సంఘ్ పరివార్ కు మజ్లిస్ పార్టీ ‘ముస్లింమోర్చా’లా మారిపోయిందని శాసనమండలిలో ప్రతిపక్షనాయకుడు షబ్బీర్ ఆరోపిస్తున్నారు.అయితే కాంగ్రెస్, మజ్లీస్ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చల్లారకపోగా మరింత ఉధృత రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నవి.