కైతికాల కథలు.

కయ్యకెల్లి గడ్డన పడ్డరు…
గా వారం దినాలన్నీ పల్లెల్ల పైసలే పైసలు..
గరీబోళ్ల చేతుల్లో వెయ్యిలు మెదులుతాంటే… దొర చేతుల్లో లక్షలు మెదులుతానయ్‌…
సర్కారు రైతుకు రైతు బంధువు… చెక్కు ఇచ్చిరి…
గా చెక్కు అందుకొని రుమాలు చుట్టుకొని కొందరు పట్నం బ్యాంకులల్ల లైన్ల నిలబడి పైసలు తెచ్చుకుండ్రి…
ఇగ దొరలైతే కార్లల్ల బ్యాంకు కాడికెల్లి కట్టల కట్టలు యెనుక సీట్ల యేసుకొని వెళ్లిరి…
గీ ముచ్చట పేపర్ల్ల జూసి ముఖ్యమంత్రి మురిసిపోయిండు…
ఇగ మళ్లచ్చే ఎలచ్చన్లల్ల చెక్కు తీసుకున్నోళ్లంతా ఊరికి వెయ్యి సొప్పున ఓట్లు పడితే మనమే గెలుసుడని ఎగిరి గంతేసిండు..
గప్పుడు ఈటల రాజేందర్‌ ఖాళీ సూట్‌కేస్‌ పట్టుకొని కేసిఆర్‌ దగ్గరికెళ్లిండు…
సారూ… ఉన్న పైలసన్నీ ఒడిసినయ్‌… చెక్కు ఇడిపిద్దామంటే బ్యాంకులల్ల పైసలు లేవని మర్లి పోతాండ్లు…
ఊర్లల్ల లొల్లి మొదలైంది… పైసలచ్చే ఉపాయం ఆలోచించమని ముఖ్యమంత్రినడిగిండు… దెహ గదెంత పని సూద్దాంపో అన్నడు… ఒక్క నిమిషంలోనే ఇగ పైలసచ్చినట్టే పో… అన్నడు. ఈటెల రాజేందర్‌కు ఇదంతా మనసున వట్టలేదు. సీఎం సారూ… ఏం చెబుతాండో… పైసలెట్లత్తయోనని తలకాయ పట్టుకున్నడు… గాయన పక్కకున్న సాయితదారు మనూర్లే రాజేసుని దేవుని చెప్పే దేవుని మనిషి దగ్గరికి వెళ్తే పైసలు దొరికే ఉపాయం కనుక్కోవచ్చన్నడు. కారు దీసుకొని కమలాపూర్‌ పోయిండ్లు. రాజేసున్ని తూలే మనిషి దగ్గరికెళ్లి ఈటెల రాజేందర్‌ సక్కముక్కలం పెట్టుకొని దేవునికి దండంపెట్టిండు. మా సార్‌ పైసలత్తయ్‌ అనబట్టే. రెందొద్దులల్ల పైసల కయ్యకెల్లి గడ్డ మీద వడతమనబట్టే. గిదెట్ల సాధ్యం చెప్పుండ్రి స్వామి.. అని అడిగిండు. కేసిఆర్‌ రాజేసుని భక్తుడే.. గాయనకన్నీ తెలుసు… మళ్ల నాకే తెలుసు.. అని అనుడు తోటి గిక్కడ అసలు విషయం భయటవడుతదని మళ్లోపారి మొక్కిండు. నాలుగు వేల కోట్లు గిప్పుడేనంగ దెచ్చిచ్చుడు… చెప్పు స్వామి అనుడుతోటి… నువ్వు హైదరాబాద్‌ వెళ్లే వరకు లాస్‌ కవర్‌ చేత్తడన్నడు. వెంటనే ఎక్సైజ్‌ శాఖోళ్లను పిలిపించిన ముఖ్యమంత్రి ఎండా కాలం తెంగాణ రాష్ట్రంల వయసు పోరగాండ్లు పొల్లు పొల్లు బీర్లు తాగుతాండ్రు… బీరుకు పదికెళ్లి ఇరువై పెంచుండ్రి. గా ఖర్చులన్నీ గండ్లనే ఎల్తయ్‌.. అన్న ముచ్చట కండ్లు మూసుకొని ఉన్న రాజేసుని తూలేటైనకు తెలిసింది. గీ ముచ్చట ఈటెల రాజేందర్‌కు రాజేసుని తూలెటైన చెప్పిండు. నువ్వు హైదరాబాద్‌ వెళ్లే వరకు కయ్యల వడ్డ ఆర్థిక శాఖ గడ్డకు వడుతది పో అన్నడు… అనంగనే వెనుక కారులో ఉన్న రాజేందరన్న అనుచరులకు దూప.. దూపగా ఉంటే సల్లటి బీర్లు తెచ్చుకుందామని బరండి షాపుకాడికెళితే పాత ధరకు ఇరువై నోటు కలిపితేనే బీరిత్తమని చెప్పుడుతోటి ముఖ్యమంత్రి అసలు తెలివి గక్కన్నే బయటవడింది. సీసకు ఇరువై పెంచితే నాలుగు వేల కోట్లు… అల్లికి అల్లి సున్నకు సున్న… తెల్లారి బ్యాంకుకాడ చెక్కు ఇడిపించుకొని సల్లటి బీర్లు తాగి సర్వీసు ఎక్కి పల్లెకెళ్లిండ్లు. అచ్చం రాజేసుడు తూలేటైన చెప్పినట్లే అయ్యింది.

-యెముడాల రాజన్న.