కొండముచ్చు బస్ డ్రైవింగ్.. డ్రైవర్ సస్సెన్షన్!!

బెంగళూరు:

కొందరు బస్ డ్రైవర్ల చెలగాటాలు ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ దావణగెరె డివిజన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న ప్రకాష్ బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి ఓ కొండముచ్చుకి స్టీరింగ్ అప్పజెప్పాడు. అది డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పుతుంటే చోద్యం చూశాడు. ఈ వీడియోని చిత్రీకరించిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ చూసిన అధికారులు డ్రైవర్ ప్రకాష్ ని సస్పెండ్ చేశారు.

ఈ నెల 1న దావణగెరె నుంచి బ్రహ్మసాగర వెళ్తున్న బస్సులోకి ఓ ఉపాధ్యాయుడితో పాటు కొండముచ్చు ఎక్కింది. రోజూ చూసే కొండముచ్చు కావడంతో డ్రైవర్ ప్రకాష్ దానిని ఒడిలో కూర్చోపెట్టుకొని స్టీరింగ్ అప్పజెప్పాడు. భయాందోళనలకు గురైన ప్రయాణికులు అభ్యంతరం చెప్పినా వినిపించుకోలేదు. ఓ చేత్తో కొండముచ్చుని నిమరడం మరోచేత్తో స్టీరింగ్ పట్టుకొని నవ్వుతూ కూర్చొన్నాడు. దీంతో ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్ని వీడియో తీశాడు. వీడియోలో కొండముచ్చు అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది.