కొత్త జోనల్ వ్యవస్థకు మంత్రివర్గం ఆమోదం.

హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్త జోనల్ వ్యవస్థకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 7 జోన్లు, రెండు మల్టీ జోన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇకపై ఉద్యోగుల నియామకంలో జిల్లా, జోన్, మల్టీ జోన్, రాష్ట్ర కేడర్లు ఉంటాయి. రాష్ట్ర కేడర్ పోస్టు కచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేయనున్నారు. అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరి ఉంటుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు కనీసం నాలుగేళ్లు చదివిన జిల్లానే స్థానికతగా గుర్తింపు ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖలో బోధనా ప్రొఫేసర్ల పదవీ విరమణ వయస్సు పెంచారు. వైద్య ఆరోగ్య ప్రొఫెసర్ల వయో పరిమితి 58 నుంచి 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు.

రైతు జీవిత బీమా పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 18 నుంచి 60 ఏళ్ల యవస్సు గల ప్రతీ రైతుకు రూ.5 లోల జీవిత బీమా వర్తిస్తుంది. ఎల్‌ఐసీ ద్వారా ప్రభుత్వం జీవిత బీమా అమలు చేయనుంది. ప్రతి రైతు పేరున రూ.2,271 చొప్పున ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుంది. బడ్జెట్‌లోనే బీమా ప్రీమియంకు సంబంధించిన నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. జూన్ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలను సేకరించనున్నారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపును మంత్రివర్గం ఆమోదించింది. దేవాదుల, తుపాకుల గూడెం ఆనకట్ట నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం కార్పోరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది.