కొత్త ‘శాంత్రో’ వచ్చేసింది!!

న్యూఢిల్లీ:

ప్రముఖ కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందై మోటార్స్ హ్యాచ్ బ్యాక్ కార్ శాంత్రో కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చేసింది. మిడిల్ క్లాస్ కోరుకునే బడ్జెట్ కార్లలో మొదటి స్థానంలో ఉండే శాంత్రోకి మార్పులు చేర్పులు చేసి కొత్త లుక్‌తో హ్యుందై మోటార్ ఇండియా లిమిటెడ్ మంగళవారం కొత్త కారును ప్రవేశపెట్టింది. 2014 డిసెంబర్ నుంచి పాత శాంత్రో మోడల్ కార్ల తయారీని కంపెనీ ఆపేసింది. కొత్త మోడల్ రూపకల్పనకు 10 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. మూడేళ్లుగా దీనికి ఏహెచ్2 కోడ్ నేమ్ తో పరిశోధన, అభివృద్ధి చేపట్టింది. కొత్త శాంత్రో 4-సిలిండర్ 1.1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. స్మార్ట్ ఆటో ఏఎంటీ టెక్నాలజీ, ఫ్యాక్టరీలోనే ఫిట్ చేసిన సీఎన్‌జీ ఆప్షన్‌తో వస్తున్న తొలి హ్యుందై కారు ఇదే. కారు లోపల 17.64 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఆడియో వీడియో సిస్టమ్ అమర్చారు. దీనికి ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, మిర్రర్ లింక్‌లాంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సౌకర్యాలు ఉంటాయి. వాయిస్ రికగ్నిషన్, రియర్ పార్కింగ్ కెమెరా డిస్‌ప్లే కూడా ఈ స్క్రీన్‌లో ఉంటాయి. స్టాండర్డ్ ఏబీఎస్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ఈ కొత్త శాంత్రో కారులో ఉన్నాయి. సెడాన్ మాదిరిగా ముందు, వెనుక ఏసీలు ఉండనున్నాయి. ఈ కారుకి ప్రీ బుకింగ్స్ బుధవారం నుంచి ఈ నెల 22 వరకు జరగనున్నాయి. కేవలం రూ.11,100 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకొనే 50 వేల మంది కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఈ కారు ధర రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఉండనుంది.