కొత్త సిమ్ కావాలంటే ఆధార్ ఉండాల్సిందే!

న్యూఢిల్లీ;
ప్రైవేట్ కంపెనీలు వినియోగదారుల వివరాల కోసం ఆధార్ తీసుకోరాదని సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు ఇచ్చి మూడు రోజులవుతోంది. కానీ కొత్త మొబైల్ కనెక్షన్ ఇచ్చేటపుడు ఈ-వెరిఫికేషన్ కోసం 12 అంకెల ఆధార్ నెంబర్ ఆధారంగానే టెలికామ్ కంపెనీలు సిమ్ ఇస్తున్నాయి. వినియోగదారుల వివరాలు తెలియజేసే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈకేవైసీ) కోసం ఆధార్ ద్వారా బయోమెట్రిక్ పరిశీలన చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టత కొరవడినందువల్ల తమకు టెల్కోల నుంచి ఎలాంటి సూచనలు రాలేదని.. అందువల్ల సిమ్ కార్డ్ అమ్మేటపుడు తాము ఆధార్ నే పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలోని సిమ్ కార్డ్ రీటెయిలర్లు చెబుతున్నారు. అటు మొబైల్ ఫోన్ కంపెనీల ఉన్నతాధికారులు తమకు టెలీకమ్యూనికేషన్స్ శాఖ నుంచి దీనికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదని అంటున్నారు. బయోమెట్రిక్ ప్రక్రియ కొనసాగింపునకు కావాల్సిన ఆధార్ డేటాబేస్ ని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఉడాయ్) మూసేయనపుడు తాము ఎందుకు పద్ధతి మార్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తాము పాటించాల్సిన నిబంధనలపై స్పష్టత కోసం మరో మూడు వారాల్లో ప్రభుత్వాన్ని సంప్రదించనున్నట్టు తెలిపారు. కోర్టు ఉత్తర్వులను అన్ని రంగాలు పాటించి తీరాలని.. మార్పుచేర్పులు సూచించడం తమ బాధ్యత కాదని ఉడాయ్ అంటోంది. సుప్రీంకోర్ట్ ఉత్తర్వులపై స్పష్టత కోసం త్వరలో ఉడాయ్ అధికారులను, న్యాయశాఖను సంప్రదిస్తామని టెలికామ్ శాఖ తెలిపింది.