‘కోడ్’ పరిధిలో సోషల్ మీడియా. -ఎన్నికల ప్రధానాధికారి రజత్‌

హైదరాబాద్:

సోషల్‌ మీడియాకు కూడా ఎన్నికల నిబంధనావళి (కోడ్‌) వర్తిస్తుందని, వాటిపైనా నిఘా పెడుతున్నామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. వీటిల్లో కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఉల్లంఘనలపై సైబర్‌క్రైం విభాగం సహకారం తీసుకుంటామన్నారు. ప్రభుత్వోద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. అది నిబంధనల ఉల్లంఘనే అవుతుందని చెప్పారు. ప్రస్తుతం నిబంధనావళిలోని పార్ట్‌-7 మాత్రమే అమల్లో ఉన్నందున.. ప్రభుత్వ పథకాలతో కూడిన హోర్డింగులు, బ్యానర్లను ప్రస్తుతం కోడ్‌ పరిధిలోకి తీసుకోలేమన్నారు. ప్రసార మాధ్యమాల్లో చెల్లింపు వార్తల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రజత్‌కుమార్‌ హెచ్చరించారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో కమిటీలు ఉంటాయన్నారు. పీఐబీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ టీవీకే రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ముగిసే వరకు మీడియాపై నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు. అభ్యర్థులు ప్రసార మాధ్యమాలు, సోషల్‌మీడియాలో ఇచ్చే ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.