కోదండరాం పోటీకి రామగుండం లేదా మంచిర్యాల!!

రాజకుమార్, ఆదిలాబాద్:
టీజేఎస్‌ అధ్యక్షుడు, కోదండరాం కార్మికక్షేత్రం నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన మంచిర్యాల లేదా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశముంది. మహాకూటమిలో భాగంగా పొత్తులు, సీట్లకు సంబంధించి జరుగుతున్న చర్చల్లో ఆయా పార్టీలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంచిర్యాలతో పోల్చినప్పుడు రామగుండంలో కార్మిక ఓట్లు ఎక్కువ ఉన్నందున ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని ఆయా పార్టీలు అభిప్రాయడినట్లు సమాచారం. సింగరేణిలో కోదండరాంకు ఉన్న మంచిపేరు దృష్ట్యా ఆయన మహా కూటమి అభ్యర్థిగా సింగరేణి ప్రాంతం నుంచే బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఆయనది బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నెన్నెల మండలం జోగాపూర్‌ కావడంతో సొంత జిల్లా మంచిర్యాల నుంచి పోటీ చేసినా బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు నేతలు చెబుతున్నారు. మొత్తం మీద మంచిర్యాల, రామగుండంలలో ఏదో ఒక నియోజవర్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కోదండరాంకే కల్పించినట్లు మహాకూటమి, టీజేఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై కోదండరాం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోదండరాం మంచిర్యాలను ఎంచుకుంటే ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డికి మొండిచెయ్యి ఎదురుకానుంది. ప్రేంసాగర్‌రావు గడిచిన మూడున్నర ఏళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎలాగైనా టిక్కెట్‌ దక్కుతుందనే ఆశతో సొంతంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, అమలుచేస్తున్నారు. ఈ క్రమంలో కోదండరాం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది