కోదండరాం ప్రభావంపై చర్చ.

ఉత్తర తెలంగాణలో 10 నియోజకవర్గాలు, దక్షిణ తెలంగాణలో 16 నియోజకవర్గాలపై కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి ప్రభావం కనిపిస్తోందన్న అంశంపై అధికారపక్షం తెలంగాణ రాష్ట్ర సమితిలో చర్చ జరుగుతోంది.టీజేఎస్‌ పార్టీ గురించి మీకు తెలుసా? కోదండరాం, ఆయన పార్టీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయమవుతుందని భావిస్తున్నారా? టీజేఎస్‌ ఆరోపిస్తున్నట్టు అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందనుకుంటున్నారా? టీజేఎస్‌ పార్టీ చెప్తున్నట్టు సామాజిక న్యాయం ఆపార్టీ ప్రజలకు అందిస్తుందని భావిస్తున్నారా? టీజేఎస్‌ పార్టీకి రాజకీయ పరిపక్వత, ఆర్థిక స్థిరత్వం కల్గి ఉందని భావిస్తున్నారా? అనే ప్రశ్నల ఆధారంగా సర్వే చేయించినట్టు సమాచారం. తెలంగాణ జన సమితి వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశంపై ఇంటెలిజెన్స్‌ బృందాలు అంచనా వేస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, వాటి బలాలు, బలహీనతలపై అధ్యయనం, సర్వేలు, ప్రజల మనోగతాన్ని ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో రూపొందించే ఇంటెలిజెన్స్‌ వర్గాలు టీజేఎస్‌పై ఐదు ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. ఉద్యోగ, నిరుద్యోగ, రైతు, యువత, మైనారిటీ, వివిధ కులాలు, వర్గాల నుంచి అభిప్రాయం సేకరించాయి. ప్రతి నియోజకవర్గం నుంచి 500 నుంచి 1,000 మందితో ఈ సర్వే నిర్వహించినట్లు సమాచారం.అటు ఉద్యోగ వర్గాలు, ఇటు నిరుద్యోగులపై జనసమితి ప్రభావం ఎక్కువగా ఉంటుందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. కేవలం కొంత మంది ఉద్యోగ నేతలకే అధికార పార్టీ గుర్తింపు ఇవ్వడం మిగతా సంఘాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైనట్లు ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతను కోదండరాం పార్టీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలున్నాయని నిఘా వర్గాలు సర్వేలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో అత్యధిక శాతం ఎమ్మెల్యే సీట్లను ఉద్యోగ సంఘ నేతలు ఆశించేలా పరిస్థితులున్నాయని కూడా ఇంటలిజెన్స్‌ అధికారులు నివేదికలు రూపొందించారు.

టీజేఎస్‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, టీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపే ప్రాంతాలను ఇంటెలిజెన్స్‌ వర్గాలు స్పష్టంగా గుర్తించినట్లు తెలిసింది. అయితే ఆ పార్టీ ఆర్థిక పరిపుష్టి, అంగబలం, బూత్‌ మేనేజ్‌మెంట్‌లో బలహీనంగా ఉన్నట్టు టిఆర్ ఎస్ భావిస్తున్నది.కోదండరాం కు కొందరు ఎన్‌ఆర్‌ఐలు ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.