కోదండరాం సీటు ఇంకా ‘రహస్యమే’!

రాజ్ కుమార్, ఆదిలాబాద్.

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ‌రామ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొన్నది. మంచిర్యాల, వరంగల్‌ వెస్ట్, ఉప్పల్‌, జనగామ నియోజకవర్గాలలో ఒక చోట ఆయన పోటీ చేయవచ్చు. సొంత జిల్లా మంచిర్యాల నుంచి ఆయన పోటీ చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. దీనిని కోదండరామ్ తోసిపుచ్చారు. కోదండరామ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయమై చర్చ జరుగుతున్నది.

విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు కోదండరామ్‌ మంచిర్యాల నుంచి కాకుండ విద్యావంతులు అధికంగా ఉన్న వరంగల్‌ వెస్ట్‌లో పోటీ చేస్తే సులభంగా విజయం సాధించవచ్చన్నది ‘ జన సమితి’ అభిప్రాయం. వరంగల్‌ వెస్ట్‌ పరిధిలోనే కాకతీయ యూనివర్సిటీ ఉండటం, అధ్యాపకులతో పాటు మెజారిటీ విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తారనే అంచనా ఉంది. వరంగల్‌ వెస్ట్‌ పరిధిలో రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉంది.. పలు విద్యాసంస్థలు,ఇతర పెద్దపెద్ద వ్యాపారాలు,కాంట్రాక్టర్లు,డాక్టర్లు, లాయర్లు ఇలా అన్ని రంగాల్లో ఉన్న రెడ్డి సామాజికవర్గం కోదండరామ్‌ ను ఆహ్వానిస్తోంది. లేదా ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఉప్పల్‌ పరిధిలో ఉత్తర తెలంగాణకు చెందిన వేలాది మంది స్థిరపడ్డారు. అందులోనూ రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉంది.ఉస్మానియా యూనివర్సిటీ ప్రభావం ఉంటుంది. అన్నింటికి మంచి అన్ని సామాజికవర్గాలకు చెందిన విద్యావంతులు పార్టీలతో సంబంధం లేకుండా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది.ఇక‌ కాంగ్రెస్ అభ్యర్థి విష‌యంలో ఇంకా స్పష్టత లేదు. మ‌హాకూట‌మిలో భాగంగా కోదండ‌రామ్‌ కోరితే ఈ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ కూడా అంగీకరించవచ్చు.అయితే మ‌హాకూట‌మిలోని కీల‌క పార్టీ తెలుగుదేశం ప్రాధాన్యత నియోజకవర్గాలలో ఉప్పల్‌ లో ఉన్నది.దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ ఎన్నికల బరిలో దిగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలోనూ టీజేఎస్‌ అంచనాలు భారీగానే ఉన్నవి! టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డిపై ప్రజలలో వ్యతిరేకత ఉండటం,ఉద్యమకాలంలో కోదండరామ్‌కు ఈ నియోజకవర్గంతో అనుబంధం ఏర్పడటంతో ఇక్కడి అభిమానులంతా ఈయన రాకను కోరుకుంటున్నారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ దూకుడును నిలువ‌రించడానికి టీఆర్ఎస్‌-బీజేపీయేతర పార్టీల‌న్నీ కలిసి పోటీ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఎన్నికలంటేనే రకరకాల సమీకరణలు తప్పవు.. ఈ నేపథ్యంలో గెలుపుకు ఉపయోగపడే ఏ ఒక్క అవకాశాన్ని అభ్యర్థులు వదులుకునే అవకాశం ఉండదు.. ఈ క్రమంలో కోదండరామ్‌ పోటీ చేస్తే… భారీ మెజారిటీతో గెలిచే నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు టీజేఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.అయితే మహాకూటమి ఏర్పాట్లు.. సీట్ల పంపిణీపై ఇంకా స్పష్టత రావలసి ఉన్నది.నోటిఫికేషన్ నాటి వరకు కూడా కోదండరాం సీటు ‘రహస్యం’ గా ఉంచడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.