కోరలు చాస్తున్న నయీం ముఠా సుపారీ హత్యలు, సెటిల్‌మెంట్లు. ప్రణయ్ హత్యతో మళ్ళీ వెలుగులోకి.

హైదరాబాద్:
రాష్ట్రంలో తిరిగి ‘నయీం ముఠా’ తిరిగి కోరలు చాస్తోంది. మనుషులను అత్యంత కిరాతకంగా హతమార్చడంలోనూ, భూదందాలలోనూ చేయి తిరిగిన ఈ గ్యాంగ్ మళ్లీ తన కార్యకలాపాలు మొదలుపెట్టిందని రాష్ట్ర పోలీసు యంత్రాంగం భావి స్తోంది. ఎన్‌కౌంటర్‌లో నయీం మృతి చెందిన తరువాత దాదాపు అజ్ఞాతవాసంలో ఉన్న ఈ ముఠాలోని బృందం తిరిగి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం లభించినట్లు తెలిసింది. ఈ బృందాలను కొంతమంది ప్రజాప్రతినిధులు తెరవెనుక ఉండి నేరాలను నడిపిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడాలో జరిగిన ప్రణయ్ హత్యలో నయీం ముఠాకు చెందినవారు పాల్గొన్నట్లు పోలీసులకు లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రణయ్ హత్య జరిగిన తీరును, గతంలో నల్గొండ, ఇతర జిల్లాల్లో జరిగిన వివిధ హత్యా సంఘటనలకు పోలిక ఉన్నట్లు పోలీసు అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ హత్య జరిగిన వెంటనే బిహారీ ముఠా పనేనని అనుమానించిన పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసారు. ఈ హత్యకు సుమారు నాలుగు నెలల ముందు హైదరాబాద్‌లో ఒక హోటల్‌లో పథకాన్ని రచించారని, దీనిలో ప్రస్తుతం నిందితునిగా భావిస్తున్న మహ్మద్ బారీ, వారితోపాటు ఆయనతో పరిచయమున్న మరికొంతమంది కిరాయి హంతకుల ముఠా పాల్గొన్నట్లు పోలీసు అధికారులు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు.
ఈ కేసులో అరెస్టయిన మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కరీం, నల్గొండ జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు ఈ హత్యకు పథకం పన్నినట్లు తెలిసింది. వీరితోపాటు ప్రధాన నిందితుడు మారుతీరావుకు సన్నిహితులైన 5 గురు బియ్యం (రైస్) మిల్లుల యజమానులు కూడా హత్యా పథకంపై జరిగిన చర్చల్లో పాల్గొన్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ముఠాలతో హత్యచేయించాలని ముందు పథకం వేసినా, నల్గొండ, మిర్యాలగూడ, హైదరాబాద్ ప్రాంతాల్లో పరిచయం ఉన్నవారైతే పథకం అమలు సులభతరమవుతుందని ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. హత్యకు ఉపయోగించిన కత్తిని పరిశీలించిన పోలీసులు గతంలో భువనగిరిలో జరిగిన మరో ‘పరువు హత్య’లో ఇదే విధమైన కత్తితో హత్యచేసినట్లు గుర్తించారు.
దీంతోపాటు హత్యలో పాల్గొన్న నిందితుడిని సంఘటన స్థలం నుంచి రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కారులో శరవేగంతో దాటించినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ముఠాకు చెందిన చాలామంది పోలీసులకు చిక్కకుండా రాజకీయ నాయకుల అండతో తలదాచుకుంటున్నారని, ఈ హత్యలో సుమారు నలుగురు సభ్యులు పాల్గొని ఉంటారని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. హత్యలో నేరుగా పాల్గొన్న వ్యక్తికి తోడుగా ముగ్గురు వివిధ ప్రదేశాల్లో మాటు వేశారని తెలిసింది. హత్య జరిగిన జ్యోతి హాస్పటల్ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుందని, ఈ ప్రదేశంలో సంఘటన జరిగిన తర్వాత చాలా జాగ్రత్తగా బయటపడడానికి ముందుగానే పథకాన్ని రూపొందించారు.హత్యకు ముందు అమృతతో మాట్లాడడానికి ఆమె తండ్రి మారుతీరావు ఫోన్ చేసి ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసారు. ఇదిలా ఉండగా ప్రణయ్ ఇంటివద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకుని తనను ఎవరు అనుసరిస్తున్నారో తెలుసుకునేవాడు. అయితే హత్య జరిగిన రోజు మాత్రం ఆ ఇంటిచుట్టుపక్కల మాటువేసి తనను అనుసరిస్తున్నవారిని ఎందుకు గుర్తించలేదో పోలీసులకు అంతుపట్టడంలేదు. హత్య జరిగిన ప్రదేశం నిందితులకు బాగా తెలుసునని అందుకే సంఘటనా స్థలం నుంచి ఎవరికీ పట్టుపడకుండా పరారయ్యారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నారు.నల్గొండ జిల్లాలో అనేక సంఘటనలతో నయీం ముఠాకు సంబంధం ఉండటం, హత్య తర్వాత ఎవరికీ దొరక్కుండా పరారవడం వంటి అంశాలను పరిశీలించిన పోలీసు అధికారులు ఈ హత్య నయీం ముఠా ద్వారానే జరిగిందన్న అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ హత్యపై పలు కోణాల్లో విచారిస్తున్నామని, దీని వెనుక ఎవరున్నా చర్యలు తప్పవని ఐజి స్థాయి పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు.