కోర్టు తీర్పు రాగానే బైసన్ పోలో గ్రౌండ్ లో కొత్త సెక్రెటేరియట్.

-కేంద్రం గ్రీన్ సిగ్నల్.
న్యూ ఢిల్లీ:
తెలంగాణ ప్రభుత్వానికి బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం స్పష్టం చేశారు. అక్కడ సచివాలయం నిర్మించుకోడానికి స్థలం అడిగారని ఆమె చెప్పారు. తీసుకున్న స్థలానికి తగినంత భూమిని వేరే చోట తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని నిర్మలా సీతారామన్ కోరారు. అయితే బైసన్ పోలో గ్రౌండ్ పై కొందరు కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. కోర్టులో విషయం ఎటూ తేలకముందు మేం ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని అన్నారు. అభివృద్ధి పనుల విషయంలో తమ స్థలాలు ఎక్కడ అడిగినా ఇచ్చేస్తున్నామని చెప్పారు. తమిళనాడు విషయంలో స్థలానికి ఖరీదు కట్టి డబ్బులిస్తామన్నారని తెలిపారు. డబ్బుతో తమకు పని కాదని, తీసుకున్న స్థలానికి తగ్గ స్థలమే కావాలని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్లలో రహదారుల మూసివేతపై సుదీర్ఘంగా చర్చలు జరిపామని నిర్మలా సీతా రామన్ తెలిపారు. తమకు అనేక మంది ఎంపీలు ఈ అంశంపై విజ్ఞప్తులు చేశారన్నారు. తమ పరిశీలనలో మొత్తం మూసేసిన 850 రోడ్లలో 119 రోడ్లను సరైన నిబంధనలు పాటించకుండా మూసేశారని తేలిందన్నారు. ఎంపీల విజ్ఞప్తుల్లో తప్పు లేదని  అనిపించిందన్నారు. వాటిని తక్షణమే రీ-ఓపెన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని రక్షణ మంత్రి తెలిపారు. ఇందులో 80 రోడ్లు పూర్తిగా తెరుచుకోగా, మరో 15 పాక్షికంగా తెరుచుకున్నాయి. మిగతా 24 రోడ్లు ఇంకా తెరుచుకలేదని అన్నారు.