క్యూ2లో 42% తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.

న్యూఢిల్లీ:

మాజీ సీఎండీ చందా కొచ్చర్ హయాంలో లాభాల పంట పండించిన ప్రైవేటు రంగంలోని అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంకు కష్టాల్లో పడిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో నికర లాభం ఏకంగా 42% తగ్గి రూ.1,204.62 కోట్లకు చేరింది. దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.2071.38 కోట్ల నికర లాభం ఆర్జించింది.అయితే రెండో త్రైమాసికంలో బ్యాంకు మొత్తం రాబడి పెరిగి రూ.31,914.82 కోట్లుగా ఉంది. పోయినేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.30,190.54 కోట్లు మాత్రమే. స్టాండ్ అలోన్ ఆధారంగా చూస్తే బ్యాంకు నికర లాభం 56% తగ్గి రూ.908.88 కోట్లుగా ఉంది. 2017 జూలై-సెప్టెంబర్ కాలానికి ఇది రూ.2,058.19 కోట్లు ఆర్జించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో బ్యాంకు రూ.119.55 కోట్ల నికర నష్టాలు చూపించింది. స్వతంత్ర ఆధారంగా ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.18,262.12 కోట్లు. కాగా పోయినేడాది రెండో త్రైమాసికంలో ఇది రూ.18,763.29 కోట్లు. బాంబే షేర్ బజార్ లో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ శుక్రవారం 1.45% తగ్గి రూ.315.05కి చేరింది.