ఖరీఫ్ లో 30 లక్షల టన్నుల దిగుబడి. కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు. – చీఫ్ సెక్రెటరీ జోషీ సమీక్ష.

హైదరాబాద్:
ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించే ధాన్యం కొనుగోలుకై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ శాఖ కమీషనర్ అకున్ సభర్వాల్ లతో పాటు ఏసు రత్నం, ప్రసాద్, చంద్రప్రకాశ్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ ధాన్య సేకరణకు సిధ్దంగా ఉండాలని అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. ధాన్యం అమ్ముతున్న ప్రతి ఒక్క రైతు వివరాల డాటా బేస్ ఉండాలని, కొనుగోలు కేంద్రాల నుండి గోడౌన్ లకు అయ్యే రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా కృషి చేయాలన్నారు. 2018-19 ఖరీఫ్ లో దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అవసరమైన గన్నీ బ్యాగులు, స్టోరేజ్ సౌకర్యం ఏర్పాటు దిశగా దృష్టి సారించాలన్నారు. రైతులకు ఆన్ లైన్ పద్ధతిలో చెల్లింపులు జరుగుతున్నాయని, 2016 ఖరీఫ్, 2017 రబీ, ఖరీఫ్, 2018 రబీలలో 107.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 22.18 లక్షల రైతుల నుండి సేకరించి 16,691 కోట్ల రూపాయలను వారి ఖాతాలను బదిలీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 85,33,935 రేషన్ కార్డులు, 2.73 కోట్ల యూనిట్లు ఉన్నాయని, యూనిట్ల వారిగా కార్డులను విశ్లేషణ చేయాలని సి.యస్ ఆదేశించారు. ఫిబ్రవరి, 2018 నుండి ఈ పాస్ ను అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు 43 లక్షల ట్రాన్ జాక్షన్స్ జరిగాయని తెలిపారు. గ్రామ పంచాయతీల వారిగా రేషన్ షాపుల వివరాలను మ్యాపింగ్ చేయాలన్నారు. విద్యార్ధులకు సన్న బియ్యం, దీపం పథకం, మధ్యాహ్నభోజన పథకం, రేషన్ల డీలర్ల ఖాళీల భర్తీ, నూతన షాపుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. స్టేట్ ఫుడ్ కమీషన్ వార్షిక కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని సి.యస్ ఆదేశించారు.పౌరసరఫరాల శాఖ ద్వారా వచ్చే ఖరీఫ్ ధాన్య సేకరణకు సిద్ధంగా ఉన్నామని, జిపిఎస్ ద్వారా రవాణా కార్యకలాపాలను, సిసి టివీల ద్వారా గోడౌన్స్ ను పర్యవేక్షిస్తున్నామని, కస్టమ్స్ మిల్లింగ్ ల చార్జీల చెల్లింపు, బియ్యం సేకరణ తదితర అంశాలపై కమీషనర్ అకున్ సభర్వాల్ సి.యస్ కు వివరించారు. 2014 నుండి ఇప్పటివరకు 10,331, 6A కేసులను బుక్ చేశామని సి.యస్ కు తెలిపారు. తూనికల కొలతల ద్వారా 2014 నుండి ఇప్పటి వరకు 49.38 కోట్ల స్టాంపింగ్ ఫీ, 24.56 కోట్ల కాంఫౌండ్ ఫీ గా నమోదు చేశామని, 57 వేల కేసులను బుక్ చేశామని అన్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక రైడ్ లను చేపడుతున్నట్లు సి.యస్ కు వివరించారు.