ఖలేజా ఉన్న నాయకుడు కేసీఆర్:- కేటీఆర్.

సిరిసిల్ల:
ఖలేజా ఉంటే ఏదైనా జరుగుతుంది అనడానికి కేసీఆర్ చేపడుతున్న పనులే నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు. గతంలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 50 ఏళ్ల సమయం తీసుకుంటే.. ఇప్పుడు రెండు మూడేళ్లలోనే పూర్తి అవుతుందని అన్నారు. కాలంతో పోటీపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్న తీరే దీనికి ఉదాహరణ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో రెండో విడత గొర్రెల పంపకం కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాలుగు రకాల విప్లవాలు తీసుకువస్తున్న విషయాన్ని తెలిపారు. రైతులకు రైతుబంధు పథకం ద్వారా హరిత విప్లవం, ఆహారశుద్ధి పరిశ్రమలతో గులాబీ విప్లవం, చేపల పెంపకం ద్వారా నీలివిప్లవం, బర్రెల పెంపకంతో శ్వేత విప్లవం తీసుకు వస్తున్న విషయం చెప్పారు. త్వరలోనే ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుపై పూర్తిస్థాయి ప్రకటన విడుదల అవుతుందన్నారు.
ఈ సందర్భంగా విపక్షాలపై మరోసారి మండిపడ్డారు కేటీఆర్. వాళ్లకు చెయ్యడం రాదని.. చేసేవాళ్లను చెయ్యనియ్యడం లేదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.