గుంటూరులో వేడెక్కిన రాజకీయం.

గుంటూరు:

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో గుంటూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. టికెట్ల కోసం నేతల మధ్య పోటీ తారా స్థాయికి చేరిందా?. రాజధాని అమరావతిలోని కీలక నియోజకవర్గమైన తాడికొండలో టీడీపీ పరిస్థితి ఏంటి?. సిట్టింగ్ ఎమ్మెల్యేపై టీడీపీలోనే ఎందుకు అసంతృప్తి నెలకొంది?. ఆ నియోజకవర్గంలో టీడీపీ తరుపున పోటీ త్రిముఖంగా మారటానికి కారణాలేంటి? గుంటూరు జిల్లా ఎస్సీ నియోజకవర్గమైన తాడికొండలో రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా శ్రావణ్‌కుమార్‌ గెలుపొందారు. మళ్లీ టికెట్‌ తనకే వస్తుందని భావిస్తున్నారు. కాగా.. శ్రావణ్‌పై స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనను ఇక్కడి నుంచి తప్పించాలని కోరుతున్నారు. అదే సమయంలో ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే పుష్పరాజ్‌, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌ గెలుపు కోసం ఎంతో కృషి చేశామని నాయకులు, కార్యకర్తలు తెలిపారు. అనంతరం ఆయన తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలను దగ్గరకు తీస్తున్నారని.. ఆయన వైఖరితో తాము విసిగిపోయామని అంటున్నారు. చాలా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలను గ్రూపులుగా తయారు చేశారని ఆరోపించారు. పలు గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు జరిగి ఎమ్మెల్యే దగ్గరకు వెళితే.. ఆయన పట్టించుకోవడం లేదని అన్నారు. చివరకు జిల్లా మంత్రి పుల్లారావు జోక్యంతో అవి సమసిపోతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు స్థానిక నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. శ్రావణ్‌కుమార్‌పై నెలకొన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది మంత్రి పదవిని చేపట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన సీఎం తనయుడు ‘లోకేష్‌’కు సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో.. టిక్కెట్‌ తనకే వస్తుందని ఆయన చెప్పుకుంటున్నారట. మరోవైపు ఎప్పటి నుంచో టీడీపీలో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే పుష్పరాజ్‌ కూడా తనకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండలో గెలుపు ఎంత కీలకమో అధినేత చంద్రబాబుకు తెలుసు. అందుకే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి సరైన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటిస్తారని అక్కడి టీడీపీ నాయకులు ఆశిస్తున్నారు