‘గుజరాత్ మోడల్’ కుంభకోణం.

అహ్మదాబాద్:
గుజరాత్ లో వేరుశెనగ కొనుగోలు కుంభకోణం ముదురు పాకాన పడుతోంది. రూ. 4,000 కోట్ల విలువైన వేరుశెనగ కొనుగోళ్ల కుంభకోణంలో స్థానిక బీజేపీ నేతలు, సహకార సంస్థల అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుంభకోణానికి కారకులపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా చెబుతున్న 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేరుశెనగ బస్తాలను దొంగిలించి వాటి స్థానంలో ఇసుక, మట్టి నింపిన బస్తాలు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. అంతే కాకుండా 35 కిలోల వేరుశెనగ బస్తాల్లో ఒక్కో బస్తాలో దాదాపుగా 10 కిలోల కంటే ఎక్కువ పాళ్లలో మట్టి, సున్నం నింపారని తెలిసింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన రాజ్ కోట్ పోలీసులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్ల విలువైన 10.46 లక్షల మెట్రిక్ టన్నుల వేరుశెనగ పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకోసం ఒక్క సౌరాష్ట్ర ప్రాంతంలోనే 139 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. మార్కెట్ రేటు క్వింటాలుకు రూ.3,700 ఉండగా ప్రభుత్వం రూ.4,500కి కొనుగోలు చేసింది. అయితే నాలుగు చోట్ల ప్రైవేట్ గిడ్డంగుల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో రూ.50.64 కోట్ల సరుకు కాలి బూడిదైంది. ఇలా వేర్వేరు చోట్ల ఒకే తరహాలో అగ్నిప్రమాదాలు జరగడంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై న్యాయ విచారణ జరపాలని కోరుతున్నాయి.