గుజరాత్ లో ఓలా, ఊబర్ లకు కళ్లెం!

అహ్మదాబాద్:

దేశంలో దూసుకుపోతున్న ట్యాక్సీ యాగ్రిగేటర్ సంస్థలు ఓలా, ఊబర్ ల దూకుడుకు కళ్లెం వేసే దిశగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఓలా, ఊబర్ లు నడిపే వాహనాలు చెరో 20,000కు మించరాదని పరిమితి విధించే ఆలోచనలో ఉంది. ప్రయాణికుల భద్రత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రెండు సంస్థలు లేదా యాగ్రిగేటర్లకు ఒక్కో లైసెన్స్ మాత్రమే ఇచ్చి, రెండు సంస్థలు 20,000కి మించి వాహనాలు అటాచ్ చేయకుండా చూడాలని గుజరాత్ పోస్టులు, రవాణా శాఖ తన ముసాయిదా పత్రంలో సూచించింది. వాహనాల సంఖ్యపై పరిమితి విధించడం ద్వారా రవాణా శాఖ నియమ నిబంధనలు, లైసెన్స్ షరతుల కిందికి ఈ రెండు సంస్థలను తీసుకురావడమే గుజరాత్ రాష్ట్ర ఆన్ డిమాండ్ ట్రాన్స్ పొర్టేషన్ యాగ్రిగేటర్ రూల్స్ 2018 ముఖ్య ఉద్దేశమని సీనియర్ ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా దేశంలో ఓలా, ఊబర్ వంటి ట్యాక్సీ యాగ్రిగేటర్ సర్వీసుల వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో సంప్రదాయిక ట్యాక్సీ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇరుకు రోడ్లు, ఇటీవల ట్యాక్సీ డ్రైవర్లు ప్రయాణికులపై దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఓలా, ఊబర్ సర్వీసులపై పరిమితులు విధిస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వం చెబుతోంది.