గుజరాత్ లో 8,100 కోట్ల మోసం.

అహ్మదాబాద్:

బ్యాంకులను రూ.8,100 కోట్ల మేర మోసం చేసిన గుజరాత్ స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ యజమానులను ఆర్థిక నేరస్థులుగా ప్రకటించాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం స్పెషల్ కోర్టు తలుపు తట్టింది. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్ లోని సెక్షన్ 4 కింద జయంతీలాల్ సందేశ్రా, చేతన్ జయంతీలాల్ సందేశ్రా, ఆయన భార్య దీప్తి చేతన్ సందేశ్రా, హితేష్ పటేల్ లను పరారైన నేరగాళ్లుగా ప్రకటించాలని కోరింది. వీరంతా స్టెర్లింగ్ గ్రూప్ ప్రమోటర్లని ఓ అధికారి తెలిపారు. వీరు బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.8,100 కోట్లు మోసపూరితంగా రుణం తీసుకున్న కేసు దర్యాప్తు నుంచి తప్పించుకొనేందుకు విదేశాలకు పారిపోయారు. పరారైన నేరగాళ్ల చట్టం ప్రకారం వడోదరలోని వీరి రూ.5,000 కోట్ల పైచిలుకు ఆస్తిపాస్తులను జప్తు చేయాలని ఏజెన్సీ కోరింది.