‘గులాబీ’ వాసన లేని ‘వెలుగు’.

  • ప్రతి పేజీలో ‘స్వేచ్ఛా’ వాయువులు!!

ఎస్.కె. జకీర్.

‘వెలుగు’ దినపత్రికలో ‘గులాబీ’ వాసన లేదు. ‘నమస్తే తెలంగాణ’ ఒరవడిలోనే ఈ పత్రిక కూడా కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీకి బాకా ఊదుతుందని ప్రచారం సాగింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, టిఆర్ఎస్ నాయకుడు, పారిశ్రామికవేత్త డాక్టర్ జి.వివేక్ ఆధ్వర్యంలో ‘వెలుగు’లోకి వచ్చిన పత్రిక అయినందున అలాంటి ప్రచారం హేతుబద్ధమైనదే. ‘వెలుగు’ పత్రిక మార్కెట్ లోకి వచ్చి ఇంకా వారం కూడా కాలేదు. అప్పుడే ఈ పత్రిక ‘పాలసీ’ పై ఒక నిర్ధారణకు రావడం సమంజసమో, కాదో తెలియదు. కానీ ‘కొన్ని నిజాలు’ ఈ పత్రిక ‘వెలుగు’ లోకి తీసుకొస్తున్నది. ప్రభుత్వమూ, కేసీఆర్ ను ఇరకాటంలో పడవేసే వార్తా కథనాలు వస్తున్నవి. టిఆర్ఎస్ ‘వందిమాగధ’ పత్రిక వలె కాకుండా ప్రస్తుతానికి స్వతంత్ర వైఖరి అవలంబిస్తున్నట్టు కనిపిస్తున్నది. కేసీఆర్ పై పోటీ చేయాలనుకుంటున్న ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్, విమలక్క వార్తలు కూడా దర్శనమిస్తున్నవి. ఇక తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు, ప్రకటనలు, ఆరోపణలు, బిజెపి తదితర పార్టీలకు సముచిత ప్రాధాన్యం కలిగిస్తున్నారు. అధికార పార్టీ వైపే మొగ్గు చూపకుండా ప్రతిపక్షాల వార్తలకు చోటివ్వడం చర్చకు దారి తీస్తున్నది. కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల ఇళ్లల్లో, ఆ ఊళ్ళల్లో ఉన్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు కథనాన్ని ప్రచురించడం కేసీఆర్ కు, ఆయన మద్దతుదారులకు మింగుడు పడని వ్యవహారం. కొందరు బాధితులకు ఇప్పటికీ ప్రభుత్వ పరిహారం అందలేదన్న విషయమైనా, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఆర్ధికసహాయంఅందలేదన్న సమాచారమైనా ‘వెలుగు’ పత్రిక ద్వారా వెలువడడం అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేవే. ఈ కొత్త పత్రిక తాను ‘ఇండిపెండెంట్’ వైఖరి తీసుకున్నట్టు తన కథనాలు ప్రచురిస్తుండడం, వివిధ రాజకీయ పక్షాలకు కూడా టిఆర్ఎస్ తో సమానంగా ప్రాముఖ్యం ఇవ్వడం ‘మార్కెటింగ్’ వ్యూహంలో భాగమై ఉండవచ్చు. సర్క్యులేషన్ పెంచుకునే మార్గాలను ఈ విధంగా అన్వేషిస్తుండవచ్చు.

 

‘వి6’ టివి న్యూస్ ఛానల్ కు అనుబంధంగా ‘వెలుగు’ పత్రిక వచ్చింది. ఈ సంస్థల అధినేత వివేక్ రాజకీయంగా ‘వేరే ఆలోచనలు’ చేస్తున్నారనడానికి ఆధారాలేమీ లేవు. ప్రస్తుతం ఆయనకు టిఆర్ఎస్ లో ప్రాధాన్యానికి వచ్చిన ముప్పేమీ లేదు. లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా వివేక్ ఖరారైనట్టు ప్రగతి భవన్, తెలంగాణ భవన్ వర్గాలు బల్లగుద్దిచెబుతున్నవి. వివేక్ కోసమే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ను చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంటుకు పంపించారు. చెన్నూరు లో సుమన్ అభ్యర్తిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే నల్లాలఓదెలు అసమ్మతి కార్యకలాపాలను వివేక్ ‘వెనుక ఉండి’ నడిపించారని సెప్టెంబర్ రెండో వారంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. వివేక్ అంటే గిట్టని వారో, ఆయన అంటే పొసగనివారో ఇలాంటి ప్రచారం చేశారని టిఆర్ఎస్ వర్గాలంటున్నవి. ఓదెలు, సుమన్ మధ్య మైత్రి ఏర్పడినా , చెన్నూరులో జరిగిన గట్టయ్య ఆత్మాహుతి, తదితర ఘర్షణల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రచారం స్తంభించింది. తన సోదరుడు జి.వినోద్ కోసం చెన్నూరు టికెట్టును వివేక్ అడిగారు. కేటీఆర్ తిరస్కరించారు. సుమన్ ను మార్చేది లేదని స్పష్టం చేశారు.వినోద్ చెన్నూరు, బెల్లంపల్లి సీట్లపై ఆశలు పెట్టుకొని భంగపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అభ్యర్తిత్వం పెండింగులో ఉన్నందున చొప్పదండి నుంచి వినోద్ కు అవకాశం రావచ్చుననివినవస్తున్నది. ఒకవేళ చొప్పదండి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ ఆదేశించినా వినోద్ సన్నద్ధత ఏమిటో తెలియదు. చొప్పదండి సెగ్మెంటులో ‘మాదిగ’ ఓటుబ్యాంక్ గెలుపోటములను శాసిస్తుంది. అటువంటప్పుడు’మాల’ అయిన వినోద్ అక్కడి ఉంచి పోటీకి సుముఖమో, కాదో ఇంకా స్పష్టత లేదు. పైగా బొడిగె శోభకే చివరి నిముషంలో టికెట్టు ఖరారు కావచ్చునన్న ప్రచారం కూడా బలంగా సాగుతున్నది. మాజీ ఎంపి వివేక్, ఆయన సోదరుడు మాజీ మంత్రి జి.వినోద్ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ కు, టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు , ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ కు వేగంగా పార్టీలు ఫిరాయించారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత వెంకటస్వామి తనయులైన వీరిద్దరూ సోనియాకు విదేయులుగా కొనసాగారు.

కెసిఆర్ సమక్షంలో కాంగ్రెస్ కండువా మార్చి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీలో తమకు సముచిత గుర్తింపు ఇవ్వలేదన్న కారణంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాష్ట్ర అవతరణ అనంతరం టిఆర్ఎస్ తోలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక’రాజకీయ పునరేకీకరణ’లో భాగంగా టిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. గతంలో చెన్నూర్ నుండి జి.వినోద్ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి రెండుసార్లు వచ్చిన జి. వివేక్ కు ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు సంబంధించిన కథనాలు’ వెలుగు’ లో అచ్చయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తమకు న్యాయం జరగకపోవడాన్ని ప్రశిస్తున్న నిర్వాసితుల గొంతుకకు ‘వెలుగు’ వేదిక అయ్యింది. నిజానికి తమ యజమాని పార్టీ ఫిరాయించిన ప్రతిసారీ ఆయన ‘ఏ పార్టీలో చేరారో’ ఆ పార్టీకి అనుకూలంగా ‘v6’ న్యూస్ ఛానల్ తన గొంతు సవరించుకోవలసివస్తున్నది. అందువల్ల దినపత్రిక వరకు ‘కొంత’ స్వేచ్ఛను వివేక్ ప్రసాదించినట్టు భావించవచ్చునా? లేక వ్యూహమేదైనాఉన్నదా? పైగా ఇది ఎన్నికల సమయం. మీడియా పాత్ర కీలకం. ప్రజల అభిప్రాయాన్ని శాస్త్రీయంగా, వాస్తవంగా సమీకరించడానికి అయినా, లేదా ఒక పార్టీని భుజాన ఎత్తుకొని ‘భజన’ చేయడానికి అయినా, ప్రజాభిప్రాయాన్ని ‘హైజాక్’ చేయడానికి అయినా ఇదే సరైన సమయం. కారణాలేవైనా అటు ప్రభుత్వానికి సంబంధించిన పాజిటివ్ వార్తలతో పాటు నెగెటివ్ వార్తలను కూడా వివేక్ ‘వెలుగు’ లోకి తీసుకు వస్తున్నారు. గద్దర్, విమలక్క, కోదండరాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర ప్రతిపక్షాల నాయకుల వార్తలకు సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడం ‘ప్రగతి భవన్’ కు నచ్చనిది. వివేక్ ‘బ్యాలెన్సుడ్’ జర్నలిజం ఎంతకాలం కొనసాగగలదోచూడవలసి ఉన్నది.