గెలిచిందెవరు? ఓడిందెవరు?

  • టిఆర్ఎస్ చేతిలో టిఆర్ఎస్ ఓటమి.
  • గట్టెక్కని గండం.
  • అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం!!!

ఎస్.కే. జకీర్.
ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా గెలుపొంది ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆశీస్సులతో టీఆర్ఎస్ లో చేరి
మేయర్ గా ఎన్నికైన కొంకటి లక్ష్మీ నారాయణ టీఆరెస్ చేతిలోనే ఓటమి పాలయ్యారు. అదే ‘వర్తమాన రాజకీయం’. అయితే రామగుండంలో ‘గండం’ పూర్తిగా గట్టెక్కలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునిసిపల్ కార్పొరేషన్ రాజకీయాల ప్రభావం ఉంటుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ‘అయిదు స్తంభాల ఆట’ నడుస్తున్నది.టీఆరెస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, గురువారం నుంచి మాజీ
మేయర్ అయిన కొంకటి లక్ష్మీ నారాయణ, పార్టీ నాయకుడు కోరుకంటి చందర్,పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, జడ్పీటీసీ సంధ్యారాణి గ్రూపులుగా తెలంగాణ రాష్ట్ర సమితి ముక్క చెక్కలయి ఉన్నది. వచ్చే ఎన్నికల్లో మాజీ మేయర్ కన్నా మిగతా ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే టికెట్ కోసం ‘సోమారపు’ ను గట్టిగా ఢీకొననున్నారు. ఇక ‘అవిశ్వాస తీర్మానం’ సంగతి పక్కన బెడితే గత నెల రోజులుగా రామగుండంలో పాలనా వ్యవస్థ పూర్తిగా స్తంభించినట్టు పౌరులు చెబుతున్నారు.పదవుల కోసం నాయకులు, ప్రజాప్రతినిధులు పంతాలు,పట్టింపులు, సన్యాసం వంటి విన్యాసాలతో ‘అభివృద్ధి’ కి గండి పడినట్టు జనం చెబుతున్నారు. నగర పాలన అటకెక్కింది. గోవా,తిరుపతి, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో నిర్వహించిన ‘ శిబిరాల’కు భారీగా ఖర్చు జరిగింది. కార్పొరేషన్ మేయర్ ను గద్దె దింపిన ప్రహసనంపై రామగుండం వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యేసోమారపుసత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణల మధ్య ఆధిపత్యపోరుకు గురువారం తెరపడింది. ఎమ్మెల్యే నెగ్గారు. మేయర్ ఓడిపోయారు.రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం అనేక మలుపులు తిరిగింది. నాటకీయ ఫక్కీలో పరిణామాలు చోటు చేసుకున్నవి. ఆ క్రమంలో మనస్థాపానికి గురైన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజకీయ సన్యాసమే ప్రకటించారు. ఆతర్వాత తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి కేటీఆర్ సమక్షంలో మళ్లీ ఆయనే హైదరాబాద్ లో మీడియా ముందు చెప్పడం వంటి పరిణామాలు రక్తికట్టించాయి. స్వపక్షంలోనే తన రాజకీయ ప్రత్యర్థిగా తయారైన మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాసానికి అధిష్ఠానం నుంచి ఎలాంటి అడ్డుకట్ట లేకుండా ఎమ్మెల్యే
చక్రం తిప్పారు. క్యాంపు రాజకీయాలు నడిచాయి. ఓ కో-ఆప్షన్ మెంబర్ తో పాటు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ క్యాంపులో మరో 28మంది కార్పోరేటర్లు చేరడం టీఆరెస్ కు బలాన్నిచ్చింది.మొత్తం 50 డివిజన్లలోని 50 మంది కార్పోరేటర్లకుగాను 19 మంది కాంగ్రెస్ కార్పోరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ కార్పోరేటర్లకు ‘విప్’ జారీ చేసి, అవిశ్వాసంలో తనను గట్టెక్కించాలని మేయర్ కొంకటి కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసారు.కొందరు కాంగ్రెస్ కార్పొరేటర్లను గోవా క్యాంపునకు పంపించారు.కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవిపైనే కన్నుపడింది. క్యాంపులో భాగంగా హైదరాబాద్ లో ఉన్న ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పోరేటర్లను మాజీమంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించే యత్నం చేశారు.కాంగ్రెస్ కు ఉన్న 19 మంది కార్పోరేటర్ల బలంతో మేయర్ పదవినే దక్కించుకునేలా యత్నం చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. టీఆర్ఎస్ కు మేయర్, కాంగ్రెస్ పార్టీ కి డిప్యూటీ మేయర్ పదవని ముందే ఒప్పందం కూడా జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి క్యాంపు మారింది. 39 మంది అవిశ్వాసానికి నోటీసిచ్చిన నేపధ్యంలో జాయింట్ కలెక్టర్ వణజాదేవి సమక్షంలో గురువారం బలనిరూపణ ప్రక్రియ పూర్తయింది. క్యాంపు రాజకీయాలు, కాంగ్రెస్ ముఖ్యనేతలను కూడా విభేదించి ఆ పార్టీ కార్పోరేటర్లు సోమారపు క్యాంపులో వెళ్లిపోవడంతో మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ పదవికి ముప్పు వచ్చిందని ముందుగానే వెల్లడైంది. ఈ మేయర్ పీఠంపై జాలి రాజమణి, దాసరి సావిత్రి, కోదాటి ప్రవీణ్, బక్కి రాజకుమారి ఆశించారు. ఫలిిితం దక్కలేదు.8 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. టీఆరెస్ కు మద్దతు పలికారు. రామగుండం నగరపాలక సంస్థ కార్పోరేటర్లు 50, ఎక్స్ ఆఫిషియో సభ్యులు ఇద్దరు కలుపుకుని మొత్తం 52 మంది ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం గురువారం రామగుండం మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాసం పై కార్పోరేటర్లతో నిర్వహించిన సమావేశంలో 37 మంది సభ్యులు హజరయ్యారు.2/3 కన్నా ఎక్కువ సభ్యులు హజరు కావడంతో అవిశ్వాస తీర్మాన సమావేశం జరిగింది.37 మంది అవిశ్వాసానికి మద్దతుగా నిలవడంతో రావగుండం మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 26 మంది టీఆరెస్, 8 మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీ నుంచి మేయర్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు.ఎమ్మెల్యే సోమారపు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.కాంగ్రెస్ కార్పొరేటర్లు ‘విప్’ ను ధిక్కరించి అవిశ్వాసానికి హాజరయ్యారు.