గౌరీ లంకేష్ హిందూ వ్యతిరేకి,అందుకే చంపాం

 

  • గౌరీ లంకేష్ హిందూ వ్యతిరేకి,అందుకే చంపాం
గౌరీ లంకేష్

బెంగళూరు :

సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు ఒక నిందితుడిని  అరెస్ట్ చేశారు. నిందితుడు కె.టి.నవీన్ కుమార్ గౌరీ లంకేష్ హత్యకు బుల్లెట్లు సరఫరా చేసినట్టు అంగీకరించాడు. 12 పేజీల నేరాంగీకార పత్రంలో నవీన్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. తాను ఏ విధంగా  హంతకులకు సహకరించాడో వివరించాడు.‘‘ప్రవీన్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. తాను, తమ కార్యకర్తలు హిందూ వ్యతిరేకియైన గౌరీ లంకేష్ ను చంపాలనుకుంటున్నామని..తమకు బుల్లెట్లు కావాలని  అడగడంతో ఇచ్చాను’’ అని  చెప్పారు. గౌరీ లంకేష్ హత్యకు గురైన తొమ్మిది నెలల తర్వాత నవీన్ కుమార్ నేరాంగీకార పత్రాన్నే పోలీసులు చార్జీషీట్ లో భాగంగా కోర్టులో సమర్పించారు. హత్యకు పకడ్బందీ ప్రణాళిక, హత్యకు ముందు గౌరీ లంకేష్ ఇంటి ముందు పలు మార్లు  రెక్కీ నిర్వహించడంతో పాటు 131 అంశాలను పోలీసులు చార్జీషీట్ లో సాక్షాలుగా పేర్కొన్నారు.పోలీసులు తెలిపిన ప్రకారం కె.టి.నవీన్ కుమార్ కరుడుగట్టిన హిందుత్వ వాది. మైసూర్ లో కాలేజీ స్టూడెంట్ గా వున్నప్పుడు హిందుత్వ భావజాలానికి ఆకర్శితుడైన నవీన్ కుమార్ బి.కామ్  చదువును మధ్యలోనే ఆపేసి అక్రమ ఆయుధ వ్యాపారాన్ని మొదలుపెట్టినట్టు చెబుతుంటారు. 2014 లో హిందూ యువసేన ను స్థాపించాడు. హిందువులు ఆయుధాలు పట్టండని పిలుపునిచ్చాడు. తరచుగా మంగళూరు వెళ్లి శ్రీరామ్ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ ను కలిసేవాడు. హిందూ జన జాగృతి సమితి వార్షికోత్సవాల్లో ప్రవీన్ అనే వ్యక్తి తనకు కలిశాడని..హిందూ వ్యతిరేకి ఐన గౌరీ లంకేష్ ను హత్య చేయడానికి బుల్లెట్లు కావాలని అడిగడంతో ఇచ్చి వాటిని టెస్ట్ చేసుకోమని చెప్పినట్టు  నవీన్ కుమార్ పోలీసులకు చెప్పాడు. అయితే వాటిని చూసిన ప్రవీన్ వాటి కంటే ఇంకా మంచి బుల్లెట్లు కావాలని అడిగారని..వేరే బుల్లెట్ల కొరకు తాను ప్రయత్నించినా దొరకలేదని..ఆ విషయం చెబుదామంటే అప్పటికే ప్రవీన్ ఫోన్ స్విచాఫ్ అయ్యిందని నవీన్ కుమార్ కన్ఫెషన్ రిపోర్ట్ లో వెల్లడించాడు. గౌరీ లంకేష్ హత్యకు బెంగళూరు, బెల్గామ్ లో పథకం రచించినట్టు వెల్లడించాడు. కల్ బురిగి హత్యానంతరం  హేతువాది, ప్రొఫెసర్ భగవాన్ హత్యకు కూడా కుట్ర పన్నినట్టు ఒప్పుకున్నాడు. అయితే కల్ బురిగి హత్య తర్వాత ప్రొఫెసర్ భగవాన్ కు పోలీస్ భద్రత కల్పించడంతో వారి పథకం పారలేదు.