గ‌చ్చిబౌలి స్టేడియంలో రేపు అంత‌ర్జాతీయ ‘యోగా డే’.

  • ఆయుష్ విభాగం ఆధ్వ‌ర్యంలో భారీ ఏర్పాట్లు.

హైద‌రాబాద్:
4వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని ఈ నెల 21న ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వం. వ‌ర‌స‌గా నాలుగోసారి గ‌చ్చిబౌలి స్టేడియంలో యోగా డేని నిర్వ‌హిస్తున్న‌ది. ఈ యోగా దినోత్స‌వానికి ఆయుష్ విభాగం భారీ ఏర్పాట్లు చేస్తున్న‌ది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్‌లో గురువారం నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అధ్యక్ష‌త వ‌హిస్తుండ‌గా, డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ, కేంద్ర రోడ్లు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారులు, షిప్పింగ్‌, ర‌సాయ‌న‌, ఎరువుల శాఖ‌ల స‌హాయ మంత్రి మాన్‌షుక్ ల‌క్ష్మ‌ణ్ మాంధ‌వ్య, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజ‌రు అవుతున్నారు. యోగం అంటే సాధన అనీ, అదృష్టమనీ అర్థాలున్నాయి. భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో “యోగ” లేదా “యోగ దర్శనము” ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల  ప్రకారం “యోగం అంటే చిత్త వృత్తి నిరోధం”. స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను “పతంజలి అష్టాంగ యోగం’ అంటారు. పతంజలి యోగసూత్రాలు సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాల స‌మాహారం. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.
2015లో జూన్ 21న మొద‌టి అంత‌ర్జాతీయ యోగా డేను నిర్వ‌హించారు. ఐక్య రాజ్య స‌మితి సైతం యోగా ప్రాధాన్యాన్ని గుర్తించింది. యోగా వంద‌ల ఏళ్ళ క్రిత‌మే భార‌త దేశంలో విరివిగా ప్రాచుర్యంలో ఉండేది. త‌ర్వాత కాలంలో ప్రాశ్చాత్య దేశాలు యోగాను ఎక్కువ‌గా పాటిస్తున్నాయి. జీవ‌న‌శైలిలో వ‌చ్చిన మార్పులు దీర్ఘ‌కాలిక‌, నాన్ క‌మ్యూనికేబుల్ డిసీజెస్ కి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇలాంటి, ఊబ‌కాయం వంటి అనేక‌ వ్యాధుల నుంచి ర‌క్షించుకోవడానికి యోగా మంచి సాధ‌న‌మ‌ని చెబుతున్నారు. మ‌నుసుని బుద్ధితో, బుద్ధిని శ‌రీరంతో, శ‌రీరాన్ని ప్రకృతితో స‌మ‌న్వ‌యం చేసేదే యోగాగా యోగా నిష్ణాతులు అంటున్నారు. దీంతో ఆధునిక కాలంలో యోగా ప్ర‌ధాన్యం మ‌రింత‌గా పెరుగుతున్న‌ది.ఈ నెల 21న గ‌చ్చిబౌలి స్టేడియంలో ఉద‌యం 6.30గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే యోగ కార్య‌క్ర‌మానికి స‌భాధ్య‌క్ష‌త వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి వ‌హిస్తుండ‌గా ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ, విశిష్ట అతిథిగా కేంద్ర రోడ్లు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారులు, షిప్పింగ్‌, ర‌సాయ‌న‌, ఎరువుల శాఖ‌ల స‌హాయ మంత్రి మాన్‌షుక్ ల‌క్ష్మ‌ణ్ మాంధ‌వ్య హాజ‌రు అవుతున్నారు. అతిథులుగా మంత్రులు మ‌హేంద‌ర్‌రెడ్డి, ప‌ద్మారావు, త‌లసాని శ్రీ‌నివాస యాద‌వ్‌, జిహెచ్ఎంసి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధి డాక్ట‌ర్ వేణుగోపాల చారి, టిఎస్ఎంఎస్ ఐడిసి చైర్మ‌న్ ప‌ర్యాద కృష్ణ‌మూర్తి, ఎంపీలు బండారు ద‌త్తాత్రేయ‌, కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేట‌ర్ త‌దిత‌రులు హాజ‌ర‌వుతున్నారు. అలాగే వైద్య ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, డిఎంఇ డాక్ట‌ర్ ర‌మేశ్‌రెడ్డి, నిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మ‌నోహ‌ర్‌, డిపిహెచ్ డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు త‌దిత‌ర ఉన్న‌తాధికారులు కూడా హాజ‌ర‌వుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా యోగా డేను నిర్వ‌హిస్తున్నారు. 2015 నుంచి ఎంపిక చేసిన 27 గ్రామాల‌తోపాటు ఈ సారి కొత్త‌గా ఏర్ప‌డ్డ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ యోగా డే జ‌రుగుతున్న‌ది. ఎంపిక చేసిన 10 జిల్లాల్లో సెంట్ర‌ల్ కౌన్సిల్ రిస‌ర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోప‌తి స‌హ‌కారంతో నిర్వ‌హిస్తున్నామ‌ని ఆయుష్ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ రాజేంద‌ర్‌రెడ్డి వివ‌రించారు. అలాగే యోగా డేకు అంద‌రూ ఆహ్వానితులేన‌ని, వివిధ విద్యా సంస్థ‌లు, ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ సంస్థ‌లు, ప్ర‌జ‌లు కూడా వారికి అందుబాటులోనిర్వ‌హిస్తున్న చోట్ల పాల్గొనాల‌ని రాజేంద‌ర్‌రెడ్డి తెలిపారు.