చంద్రబాబు ను బర్తరఫ్ చేయాలి. – బీజేపీ డిమాండ్.

అమరావతి:
ముఖ్యమంత్రి చంద్రబాబు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. ఎయిర్ పోర్టులకు సేకరించిన భూమిని ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. చివరకు స్కూలు భవనాలకు రంగులు వేసే పనుల్లో కూడా అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్నదంతా భగవంతుడు చూస్తున్నాడని, ఆయన అవినీతికి పంచభూతాలే సాక్ష్యాలని చెప్పారు. చంద్రబాబు ఇంత అవినీతికి పాల్పడుతుంటే గవర్నర్ నరసింహన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును వెంటనే బర్తరఫ్ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మట్టి తవ్వి తీయడానికి రూ.13600 కోట్లు ఖర్చు చేశారా ?అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..తవ్విన మట్టిని కూడా టీడీపీ నాయకులు అమ్మేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబూ నిన్ను పంచభూతాలు గమనిస్తున్నాయి..జాగ్రత్త అని హెచ్చరించారు.
పాఠశాలలకు సున్నం వేయడానికి మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే..ఏకంగా రూ.120 కోట్లు మింగేశారని ఆరోపించారు. ఇదో భారీ కుంభకోణమని వ్యాఖ్యానించారు. స్కూలు యూనిఫారాల టెండర్‌ రూ.250 కోట్లకు మరో వ్యక్తికి కట్టబెట్టారు..ఇదో కుంభకోణం అని అవినీతి ఆరోపణలు గుప్పించారు.