చట్టవ్యతిరేక బాబాలను ఉరితీయాలి! -రాందేవ్ బాబా.

న్యూ డిల్లీ;
తమను తాము దైవంగా ప్రకటించుకునే బాబాలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తేలితే వారిని ఉరితీయాలని యోగా గురువు రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. తమ పని, హద్దులు దాటి వ్యవహరించే వారెవరైనా వారిని జైలుకు పంపడమే కాదు, ఉరితీయాలని, ఈ విషయంలో రాజీ పడకూడదని రామ్‌దేవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
మతనాయకుడంటే కాషాయం కట్టుకోవడమే ప్రాతిపదిక కాదని రాందేవ్ అన్నారు. ‘వృత్తి ఏదైనా దానికి హద్దులంటూ ఉంటాయి. ప్రతి ఉద్యోగానికి ప్రోటోకాల్ ఉంటుంది. బాబాలకూ ఇది వర్తిస్తుంది. కాషాయం కట్టుకున్నంత మాత్రాన బాబాలు అయిపోరు. గుణగణాలు చాలా ముఖ్యం’ అన్నారు. స్వయం ప్రకటిత గాడ్‌మెన్ ఒకరు తాజాగా అత్యాచారం ఆరోపణల్లో చిక్కుకోవడంపై అడిగినప్పుడు రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.