చావుబతుకుల కేసులకే అర్జంట్ హియరింగ్!-సుప్రీం చీఫ్ జస్టిస్.

న్యూఢిల్లీ:

భారత సుప్రీంకోర్ట్ 46వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టగానే జస్టిస్ రంజన్ గొగోయ్ సంచలన నిర్ణయాలు ప్రకటించారు. ఎవరైనా చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా, కట్టుబట్టలతో ఇంటి నుంచి తరిమివేసిన కేసులను మాత్రమే వెంటనే విచారణ చేపట్టాలి తప్ప ప్రతి విషయాన్ని అత్యవసర విషయంగా పరిగణించేది లేదని స్పష్టం చేశారు. అత్యవసర విషయం అంటే అత్యవసర విషయంగానే ఉండాలని చెప్పారు. ఇకపై మెన్షనింగ్ కోసం మొదట అర్జీ దాఖలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అత్యంత కీలకమైన అంశాలు మాత్రమే మెన్షన్ కి స్వీకరిస్తామని తెలిపారు. నిర్దిష్టమైన ప్రమాణాలు నిర్ణయించే వరకు మెన్షనింగ్ కింద విచారణ చేపట్టరాదని స్పష్టం చేశారు.ఎవరైనా ఉరి కంబం ఎక్కుతుంటే, ఇవాళే ఎవరికైనా చావుబతులు నిర్ణయించాల్సి ఉంటేనే వెంటనే విచారణ చేపట్టాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. రాబోయే 13 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగనున్న జస్టిస్ గొగోయ్ ఇవాళ అర్జెన్సీ అంటూ తన ముందుకొచ్చిన మొదటి కేసునే తిరస్కరించారు. హర్యానాలో అక్రమ భూకబ్జాల గురించి అర్జెన్సీ మెన్షనింగ్ చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఘాటుగా స్పందించారు. అర్జెన్సీ కేసులను కొత్త తరహాలో పరిష్కరిస్తానని చెప్పారు.