చావుబతుకుల మధ్య పిల్లలమర్రి.

మహబూబ్ నగర్:
‘పిల్లలమర్రి’. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో వున్న ఆ మర్రి చెట్టు పేరు పిల్లలమర్రి. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి వున్న పిల్లలమర్రి తెలంగాణలోని ఓ ప్రముఖ పర్యాటక కేంద్రం. చుట్టూ ఊడలు విస్తరించి వుండడంతో పిల్లలమర్రి చెట్టులో అసలు వేర్లు ఎక్కడున్నాయో గుర్తించడం కష్టం. 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి ప్రపంచంలోని అత్యంత పెద్ద వృక్షాల్లో ఒకటి. నిత్యం వందలాది మంది పర్యాటకులతో కళకళలాడిన పిల్లలమర్రి నేడు బోసిపోయి వుంది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆ మహావృక్షం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. చెట్టు లోపలి భాగాన్నంతా చెదలు తినివేయడంతో ఎక్కడికక్కడ వేర్లు, కొమ్మలు విరిగిపడతున్నాయి. దాన్ని రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యాటకుల అనుమతిని నిలిపివేసి సెలైన్ బాటిల్స్ ద్వారా రసాయనాలు ఎక్కించి రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని..చెట్టును బ్రతికించడం కష్టమని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతుండగా..రసాయనాలతో చెట్టులో మార్పు కనిపిస్తుందని అటవీ శాఖాధికారులు అంటున్నారు. వారి ప్రయత్నం ఎంత వరకు సఫలమవుతుందనేది వేచి చూడాలి.