‘చేతులు కట్టేసి కాల్చారు’. – ప్రత్యక్ష సాక్షి డ్రైవర్.

విశాఖపట్నం:
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్యలపై సోమ డ్రైవర్ చిట్టిబాబు మాట్లాడారు. ఇరవై మంది మావోయిస్టులు రోడ్డుకు అడ్డంగా వచ్చారని చెప్పారు. తమకు తుపాకులు ఎక్కుపెట్టారని, వాహనాన్ని ఆపాలని హెచ్చరించారని తెలిపారు. వాహనాలు ముందుకు వెళ్తే బాంబులతో పేల్చేస్తామని బెదిరించారని అన్నారు.వారు హెచ్చరించినా తాము ముందుకు వెళ్లామని డ్రైవర్ చెప్పారు. ఇంతలో మరికొందరు మావోయిస్టులు వచ్చి వాహనాలకు అడ్డంగా నిలబడ్డారని చెప్పారు. మావోయిస్టుల చేతులో తుపాకులు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఇందులో ఎమ్మెల్యే ఎవరు, మాజీ ఎమ్మెల్యే ఎవరు అని అడిగారని చెప్పారు.చుట్టుముట్టి, వెపన్స్ తీసుకొని, ఎమ్మెల్యే కిడారి హత్యకు ముందు గంటసేపు మావోయిస్టులు మాట్లాడారు. ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను కిందకు దింపి చేతులు కట్టివేశారని డ్రైవర్ చిట్టిబాబు చెప్పారు. తమ నుంచి చాలా దూరం అడవుల్లోకి తీసుకు వెళ్లారని చెప్పారు. తాము అక్కడి నుంచి పారిపోకూడదని కొందరిని కాపలా కూడా పెట్టారని చెప్పారు. గన్‌మెన్ల నుంచి తుపాకులు లాక్కున్నారని చెప్పారు.నలభై నిమిషాల తర్వాత కాల్పుల శబ్దం వినిపించిందని డ్రైవర్ చిట్టిబాబు చెప్పారు. కాల్పుల శబ్దం వినబడిన తర్వాత తమను వదిలి పెట్టారని తెలిపారు. ఆ తర్వాత తాము అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులతో మాట్లాడారు. జిల్లాల్లో శాంతిభద్రతలపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యను పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రంగా ఖండించారు. తమ నియోజకవర్గాల్లోని గ్రామాల సమస్యలు స్వయంగా తెలుసుకుంటేనే తప్ప ప్రజలకు న్యాయం చేయలేమన్నారు. ఆ పనిలో భాగంగానే ‘గ్రామదర్శని’ కార్యక్రమానికి కిడారి వెళ్లారని చెప్పారు. మావోల ఘాతుకంలో ఇద్దరూ చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. ఎమ్మెల్యేలు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే క్రమంలో ఈ దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు. సంక్షేమం, అభివృద్ధిలపై ప్రతి గ్రామానికి వెళ్లి చూడకుంటే ఎలా అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందన్నారు. మంత్రి నారా లోకేష్, స్పీకర్ కోడెల శివప్రసాద రావు కూడా ఖండించారు. సర్వేశ్వర రావు చలాకీగా ఉండే వ్యక్తి అని కోడెల అన్నారు. ఆయనంటే తనకు ఇష్టమన్నారు. మావోయిస్టుల చర్యలను ఖండిస్తున్నానని చెప్పారు. హత్యలతో వారేమీ సాధించలేరని, సిద్ధాంతపరంగా పోరాడాలన్నారు. కుటుంబాలకు అండగా ఉంటామని లోకేష్ చెప్పారు.అరకు పోలీస్ స్టేషన్ ఎదుట సోమ బంధువులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్నారు. సంఘటన జరిగి ఇంతసేపైనా వెళ్లకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పైన స్థానికులు దాడి చేశారు. నేతలను కాపాడటంలో విఫలమయ్యారంటూ స్థానికులు, బంధువులు పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. మూడ్రోజులుగా మావోయిస్టులు వారోత్సవాలు జరుపుకుంటుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. స్థానికుల దాడితో అక్కడున్న పలువురు పోలీసులు పరుగులు పెట్టారు. దాడి నేపథ్యంలో డుంబ్రిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కాల్చి చంపడానికి ముందు సర్వేశ్వరరావుతో గంటసేపు మావోయిస్టులు మాట్లాడారు.సర్వేశ్వరరావుకు చెందిన ‘గూడ ‘క్వారీ మూసివేయాలని మావోయిస్టుల హెచ్చరిక
చేశారు.బెదిరింపులొద్దని, చర్చలతో పరిష్కరించాలని కిడారి కోరారు.

దీంతో ఆగ్రహించి మావోయిస్టులు కాల్చి చంపిన ట్టు తెలుస్తోంది.హుకుంపేట మండలంలో సర్వేశ్వరరావుకు చెందిన గూడ క్వారీ, బాక్సైట్ తవ్వకాలపై ఆయన్ని మావోయిస్టులు ప్రశ్నించినట్టు సమాచారం. ఒడిశాలో ఎన్ కౌంటర్ కు సర్వేశ్వరరావే కారకులంటూ మావోయిస్టులు నిలదీశారు.పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని కిడారి సోదరుడు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి చెందారు. మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోము మృతి చెందడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన ఈ దాడిని ఖండించారు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు. ప్రజాప్రతినిధులను మావోయిస్టులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో హింసకు, హత్యలకు తావు లేదన్నారు. కిడారి, సోమ కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా హై అలర్డ్ విధించారు. నేతలు రక్షణ లేకుండా బయటకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచనలు చేసింది. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. జిల్లాలోని మంత్రులకు భద్రతను పెంచారు. రంపచోడవరం, చింతూరు డివిజన్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. మావోయిస్టుల దాడిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఏపీ డీజీపీని ఆదేశించింది. డుంబ్రీగుడ మండలం లివిటిపుట్ట వద్ద మావోయిస్టులు వారిని కాల్చి చంపిన విషయం తెలిసిందే.

“నా తండ్రి కూడా ఎప్పుడూ ఈ ప్రస్తావన తేలేదు
మా నాన్నను ఎందుకు చంపారో తెలియదు”.
ఢిల్లీ నుంచి విశాఖకు బయలుదేరిన నాని
అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడంపై ఆయన కుమారుడు నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే ఢిల్లీ నుంచి విశాఖకు ఆయన బయలుదేరారు. అంతకుముందు, మీడియాతో ఆయన మాట్లాడుతూ, మావోయిస్టుల నుంచి తమకు ఎప్పుడూ హెచ్చరికలు రాలేదని, తన తండ్రి కూడా ఎప్పుడూ ఈ ప్రస్తావన తేలేదని, వారు తన తండ్రిని ఎందుకు చంపారో తెలియదని అన్నారు. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడాన్ని ఖండిస్తున్నానని జనజాగృతి పార్టీ అధినేత, ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. సర్వేశ్వరరావు మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, మావోయిస్టులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజకీయ విభేదాలున్నా కూడా సర్వేశ్వరరావు చాలా సన్నిహితంగా మెలిగేవారని గుర్తుచేసుకున్నారు.