చేబదులు కన్నా మించినది లేదు!!

న్యూఢిల్లీ:
సర్జరీ వంటి అత్యవసర అవసరాలకు రుణం కావాలా? మీరు ఆర్థిక సంస్థలకు బదులు మిత్రుల దగ్గర చేబదులు తీసుకోవడం ఉత్తమం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పుడు ఆర్థిక సంస్థలతో పోలిస్తే మిత్రుల మాదిరిగా చేబదులు ఇచ్చే అనేక సంస్థలు (పీర్-టు-పీర్ లేదా పీ2పీ) వచ్చాయి. ఇవి కేవలం 8-12% వడ్డీకే వైద్య అవసరాల కోసం రుణాలు ఇస్తున్నాయి. అదే బ్యాంకులు పర్సనల్ లోన్ పై 13-17% వడ్డీ వసూలు చేస్తున్నాయి. కొత్తగా వచ్చిన పీ2పీ టెక్నాలజీ ప్లాట్ ఫామ్స్ వేగంగా విస్తరిస్తూ రుణదాతలను, గ్రహీతలను చేరువ చేస్తున్నాయి. కేవలం వైద్యావసరాల కోసమే కాకుండా వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు, కొన్నిసార్లు గృహ రుణాలను కూడా అందిస్తున్నాయి.ఫెయిర్ సెంట్, లెన్ డెన్ క్లబ్, ఐ2ఐఫండింగ్, లోన్ ట్యాప్ వంటి పీ2పీ సంస్థలు వైద్య రుణాలను వేగంగా అందజేస్తూ ఆకట్టుకుంటున్నాయి. బ్యాంకులు వ్యక్తిగత, వైద్య రుణాలకు 5 నుంచి 7 రోజులు తీసుకుంటున్నాయి. కానీ ఈ పీ2పీ సంస్థలు డాక్యుమెంటేషన్, ఇతర ప్రక్రియలు సత్వరం ముగించి అదే రోజున 60% రుణాలు ప్రాసెస్ చేస్తున్నాయి. మిగతా మొత్తం తర్వాత రోజున అందజేస్తున్నాయి. అంతే కాకుండా ఈ డిజిటల్ రుణదాతలు టాప్ అప్ రుణాలు కూడా అందిస్తున్నారు.

ముందస్తుగా రుణం తీర్చాలనుకుంటే అదనపు చార్జీలు కూడా వసూలు చేయడం లేదు. మరోసారి అప్పు అవసరమైతే మునుపటి కంటే వేగంగా రుణం అందజేస్తున్నాయి.కొన్ని ఆస్పత్రులు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అనుమతి వచ్చేలోగా క్రెడిట్ కార్డ్ ఉపయోగించమని సూచిస్తాయి. తర్వాత ఆ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ నుంచి తీసుకోవచ్చని చెబుతాయి. కానీ దానికి వడ్డీరేటు 25-35% వసూలు చేస్తారు. ఇది వినియోగదారుడికి పెను భారంగా మారుతుంది. అందువల్ల కొన్ని పీ2పీ ప్లాట్ ఫామ్స్ ఇన్సూరెన్స్ ఉంటే వడ్డీ రహిత వైద్య రుణాలు ఇస్తున్నాయి. చాలా పీ2పీ ప్లాట్ ఫామ్స్ ఇస్తున్న రుణాల మొత్తంలో 7-8% రుణాలు వైద్యావసరాల కోసం ఇస్తున్నవే. దీంతో చాలా మంది వైద్యావసరాల రుణాల కోసం ఇప్పుడు ఈ పీ2పీ సంస్థలవైపు ఆకర్షితులవుతున్నారు.