చైనా చెక్కిన ‘ఉక్కు మనిషి’!

న్యూఢిల్లీ;
గుజరాత్‌లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరిట సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణంపై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. మోడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం ‘మేడిన్ చైనా’ అని రాహుల్ వ్యాఖ్యానించడం సంచలనం రేపాయి. దీంతో ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వంటి అగ్రనేతలంతా రాహుల్ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. సర్దార్ పటేల్ ని కాంగ్రెస్ అవమాన పరుస్తోందని విమర్శిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత వందలాది సంస్థానాలను విలీనం చేసి.. దేశ ఐక్యత కోసం పాటుపడ్డ సర్దార్ ఖ్యాతిని తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిల్డర్లను బిడ్డింగ్‌ కోసం ఆహ్వానిస్తే ఆ కాంట్రాక్టు భారత్ కి చెందిన ఎల్‌ అండ్‌ టీ దక్కించుకుందన్నారు. విగ్రహ నిర్మాణం కోసం 1700 టన్నుల కాంస్యాన్ని మాత్రమే చైనా నుంచి దిగుమతి చేసుకున్నామని, 70,000 టన్నుల ఇనుము, 18,500 టన్నుల స్టీల్ భారత్‌లోదేనని స్పష్టం చేశారు. వందలాది టన్నుల ఇనుమును దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి సేకరించామని చెప్పారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పూర్తిగా మేడిన్ ఇండియా, మేడిన్ గుజరాత్ అని బీజేపీ నేతలు స్పష్టం చేస్తుంటే కాంగ్రెస్ ట్రెజరర్ అహ్మద్ పటేల్ మాత్రం ఇది కచ్చితంగా మేడిన్ చైనా అని అందుకు రుజువులు చూపిస్తున్నారు. విగ్రహ నిర్మాణ స్థలంలో చైనా కార్మికులు కూర్చున్న ఫోటో ట్వీట్ చేస్తూ వీళ్లు చైనా పర్యాటకులా? కార్మికులా అని ప్రశ్నించారు.