జగన్ పై ముద్రగడ గరం.. గరం..

కాకినాడ:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ కాపు రిజర్యేషన్లు సాధ్యంకాదని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తుని ఘటన తరవాత.. జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కాపు రిజర్యేషన్‌లకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని, అసెంబ్లీలోనూ మద్దతు పలికారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర పరిధిలో అంశం కాదని, జగన్ యూటర్న్ తీసుకోవడం బాధాకరమని అన్నారు. కాపులు ఎప్పుడూ మీ మోచేతి నీళ్ళు తాగుతూ మీ పల్లకీలే మోస్తూ ఉండాలా? అంటూ ఆయన ద్వజమెత్తారు.కాపు ఉద్యమం పుట్టిన గడ్డమీదే జగన్ కాపులను అవమానించడం దుర్మార్గమని, తమ జాతిపై జగన్‌కు చిన్నచూపెందుకో చెప్పాలని, తమ జాతి ఏం తప్పు చేసిందో జగన్ చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపు రిజర్యేషన్లతో జగన్‌కు సంబంధం లేకపోతే… కేంద్రం పరిధిలో ఉన్న అనేక విషయాలపై ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గత ఆరునెలలుగా జగన్ పాదయాత్రలో ఇస్తున్న హామీలకు రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లు సరిపోతాయా? అని ప్రశ్నించారు. పదవీ కాంక్షతో జగన్ ఇలాంటి హామీలు ఇవ్వొచ్చు కానీ.. కాపు జాతికి రిజర్యేషన్ ఇవ్వలేరా? అని ముద్రగడ ప్రశ్నించారు.