జగన్ పై హత్యాయత్నంలో మలుపులు!!

ఎన్. చారి, అమరావతి:
వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం పలు మలుపులు తిరుగుతోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జగన్ పై హత్యాయత్నం జరిగిందని, కత్తి మెడపై తగిలి ఉంటే ప్రాణాపాయం ఏర్పడేదని చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే ఇది పబ్లిసిటీ కోసం చేసిన డ్రామా అని, హత్యాయత్నం జరగడానికి కారణం ‘అభిమానం’ అని సాక్షాత్తూ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పిన మాటలకు పూర్తి విరుద్ధంగా రిమాండ్ రిపోర్ట్ ఉండటం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అది చిన్న విషయం అన్నారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసును పలు కోణాలలో పరిశీలించవలసి ఉంది. ‘సమగ్ర విచారణ’ అని చెబుతున్నా ఇది కచ్చితంగా ప్రతిపక్ష నేత హత్యకి ‘కుట్ర’ అనేది రిమాండ్ రిపోర్ట్ తో స్పష్టమైంది. విపక్ష నేతను ఎందుకు చంపాలనుకున్నారు? అనే కోణంలో విచారణ జరిగాల్సి ఉంది. ‘శాంతి భద్రతలకు భంగం కలిగించాలని కొందరు కుట్ర పన్నారు.. అందుకే మంత్రులు, డీజీపీ, ముఖ్యమంత్రి అలా స్పందించార’ని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

ప్రతిపక్షనేతపై హత్యాయత్నాన్ని గంభీరంగా తీసుకోవాల్సి వుంటుంది. నిందితుడు జగన్ ‘అభిమాని’ కోణంలో విచారణ జరుపుతున్న పోలీసులు, ‘కుట్ర’ కోణంలో విచారణ జరపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు వైసీపీ అభిమాని అని ఎలా నిర్థారించారో తేల్చాల్సి ఉంది. అభిమానులు హత్యాయత్నం చేస్తారా? అనే ప్రశ్నకి జవాబు దొరకాల్సి ఉంది.ఆత్మహత్యలు చేసుకొనేవారు సాధారణంగా లేఖలు రాస్తుంటారు. కానీ హత్యాయత్నం చేసే వ్యక్తి లేఖలు రాయడం.. అదీ ఇద్దరు, ముగ్గురితో రాయించడం అనుమానాలకు తావిస్తోంది. నిందితుడు పదకొండు పేజీల లేఖలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడం, కత్తితో విపక్ష నేతను పొడవడం అసంబద్ధంగా ఉంది. సిఐఎస్ఎఫ్ అతనిని పట్టుకున్నప్పుడు ఈ లేఖ ఉందా? అనే విషయంలో స్పష్టత నివ్వలేదు. సీఐఎస్ఎఫ్‌ నివేదికలో ఏముందో చెప్పలేదు. ఘటన జరిగింది ఎయిర్‌పోర్ట్‌లో కాబట్టి, ఆ ఎయిర్‌పోర్ట్‌ కేంద్రం ఆధీనంలో ఉందన్న టీడీపీ నేతల వాదన ప్రకారం కేంద్ర విచారణ జరగాల్సి ఉంది.’కోడి పందాల కత్తి’ ఇక్కడ కీలక అంశం.

ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాల్లో వాడే ‘కత్తి – ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం’ అంశానికి సంబంధించి విచారణ ఆ జిల్లాల నుంచే ప్రారంభం కావాల్సి వుంది. నిందితుడు వాడిన కోడి కత్తి, అక్కడే దొరికిన మరో కత్తి ప్రస్తావిస్తూ కత్తి చాలా చిన్నదని, మరొకటి బ్లేడ్ వంటిదని పేర్కొన్నారు. నిందితుడు తరచుగా ఫోన్లు మార్చడం, కాల్ డేటా వంటి కీలక అంశాలు తెలియజేయలేదు. అదే సమయంలో శ్రీనివాస్ కు అన్ని విధాలుగా ఎవరు సహకరించారు? వారి ఉద్దేశాలేంటి? అనే విషయాలు రిమాండ్ రిపోర్టులో తెలపకపోవడం అనుమానాలకు తావిస్తుంది. రిమాండ్ రిపోర్టులో శ్రీనివాస్ వైసీపీ అభిమాని అని ఉంది కానీ అతను పనిచేసే హోటల్ యజమాని హర్షవర్ధన్ టిడిపి నేత అని ప్రస్తావించలేదు. ప్రభుత్వపరంగా ఇల్లు కేటాయింపు, ఇతని బ్యాంకు ఖాతాలలోకి డబ్బు రావడం, ఇటీవలే భారీగా డబ్బు ఖర్చు చేసి పెద్ద పార్టీ ఇవ్వడం వంటి వాటిని కూడా దర్యాప్తు సందర్భంగా పరిశీలించాల్సి ఉంది. వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్ళి జగన్‌పై హత్యాయత్నం గురించి కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపైన, డిజిపి ఠాకూర్ పై ప్రధాన ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వారే ప్రథమ, ద్వితీయ ముద్దాయిలని అంటోంది.