జమాల్ ఖషోగీని సౌదీయే హత్య చేసిందా?

ప్రకాశ్, న్యూఢిల్లీ:

రాజరిక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగీ అదృశ్యంపై సౌదీ అరేబియాపై ప్రపంచం నలుమూలల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అతని అదృశ్యం గురించి తమకేం తెలియదని బుకాయిస్తూ వచ్చిన సౌదీ ప్రభుత్వం ఇక వాస్తవాలను ఒప్పుకొనేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రెండు వారాల క్రితం ఇస్తాంబుల్ సౌదీ కాన్సులేట్ లో ఇంటరాగేషన్ జరుపుతుండగా అతను మరణించినట్టు అంగీకరించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దుర్మార్గ హంతకులు జమాల్ ఖషోగీ ప్రాణాలు తీసి ఉంటారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పటి వరకు జమాల్ ఖషోగీ అదృశ్యంపై అతనిని హత్య చేసి శవాన్ని మాయం చేశారని భావిస్తూ వచ్చారు. రెండు వారాల క్రితం ఇస్తాంబుల్ లోని సౌదీ కాన్సులేట్ కి వెళ్లిన ఖషోగీని చంపేసి మాయం చేశారని టర్కీ అధికారులు బలంగా చెబుతున్నారు. ఖషోగీ మాయమైన రోజున 15 మంది సౌదీకి చెందినవారు ఇస్తాంబుల్ వచ్చి వెళ్లారని అంటున్నారు. వారిలో ఒకరి దగ్గర ఎముకలు కోసే రంపం ఉన్నట్టు అటాప్సీ నిపుణుడు చెప్పారు. దీంతో దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు ఉండటంతో సౌదీ ప్రభుత్వం కొత్త వివరణ ఇచ్చేందుకు సిద్ధమైంది. బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ఆయుధాలు సౌదీ అరేబియాకు అమ్మడంపై ట్రంప్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. వచ్చే వారం సౌదీలో జరిగే పెట్టుబడుల సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పుడు సౌదీ అరేబియా ఖషోగీపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే తమ సర్కార్ పై మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా భావిస్తోంది. అంతే కాకుండా కాబోయే యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ రాజు కట్టుకథలు చెబుతున్నారని ఖషోగీ మిత్రులు, మానవహక్కుల కార్యకర్తలు, శ్వేత సౌధంలోని కొందరు అంటున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు దుర్మార్గ హంతకుల పాట అందుకోవడం హాస్యాస్పదమని.. ఆయన సౌదీ రాజవంశం అధికార ప్రతినిధి వర్గంలో చేరినట్టు తోస్తోందని సెనేటర్ క్రిస్టఫర్ మర్ఫీ డీకాన్ వ్యాఖ్యానించడంతో అగ్రరాజ్యం పరువు పోయినట్టయింది.

సౌదీ యువరాజుకి సన్నిహితుడైన ఓ ఇంటెలిజెన్స్ అధికారి అత్యుత్సాహంతో విచారణ సందర్భంగా పొరపాటున ఖషోగీని హత్య చేశాడని ప్రభుత్వ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఖషోగీ విచారణకు, వీలైతే స్వదేశానికి రప్పించాల్సిందిగా యువరాజు మొహమ్మద్ ఆదేశిస్తే రహస్య వ్యవహారాలలో తన ప్రతిభ నిరూపించుకొనే ఆత్రుతలో ఆ అధికారి గీత దాటి ఖషోగీని చంపేశాడు. ఆ తర్వాత ఆ పనిని కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ వ్యవహారంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయో సౌదీ రాజు సల్మాన్‌ను కలవనున్నారు. ఆ తర్వాత, ఇస్తాంబుల్‌లోని సౌదీ విదేశాంగ కార్యాలయానికి ఆయన వెళ్తారు. మొత్తానికి ఖషోగీ అదృశ్యం వ్యవహారం పాశ్చాత్య దేశాలకు, సౌదీకి మధ్య ఉన్న స్నేహ సంబంధాలను ఇరుకున పెట్టింది.