జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన మీడియాపై కమిషన్.

హైదరాబాద్:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మీడియా పరిస్థితులు, వర్కింగ్ జర్నలిస్టుల జీవన స్థితిగతులు, పని పరిస్థితుల గురించి అధ్యయనం చేయడానికి మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన ఒక ‘స్వతంత్ర కమిషన్’ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు, ద్రవిడ విశ్వ విద్యాలయం మాజీ వైస్-ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కె.ఎస్. చలం, సుప్రసిద్ధ పాత్రికేయులు చెన్నమనేని రాజేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఇటువంటి కమిషన్ ఏర్పాటు కావడం దేశంలో ఇదే మొదటిసారి. తెలంగాణలో గత నాలుగేళ్ళలో 226 మంది జర్నలిస్టులు మరణించిన నేపథ్యంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటువంటి నిష్ణాతుల చేత సమగ్ర అధ్యయనం జరిపించడం ఎంతైనా అవసరమని ‘మెఫీ’ భావించింది. కమిషన్ తొలి సమావేశం ఆదివారం హైదరాబాదులో జరిగింది. విధి విధానాలపై చర్చించారు. ఈ కమిషన్ రెండు రాష్ట్రాలలోని ముఖ్యమైన నగరాలలోనూ, కొన్ని గ్రామీణ కేంద్రాలలోనూ సమావేశమై వర్కింగ్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, మేధావులు, మీడియా సంస్థల యాజమాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ స్వతంత్ర కమిషన్ సమర్పించే నివేదిక భవిష్యత్తులో మీడియా స్వేచ్ఛను, నైతిక విలువలను పెంపొందించడానికి దోహదం చేయనుంది.