జాకెట్ నిబంధన సడలించిన లార్డ్స్.

లండన్:
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్‌లో వేడిగాలులు వీస్తున్నాయి. విపరీతమైన ఉక్కపోత ఉడకబెట్టేస్తోంది. దీంతో చారిత్రక మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తన శతాబ్దానికి పైగా పాటిస్తున్న సంప్రదాయాన్ని మార్చుకోక తప్పలేదు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలోకి జాకెట్ లేకుండా పురుషులు ప్రవేశించరాదన్న నిబంధనను సడలిస్తున్నట్టు ఎంసీసీ ప్రకటించింది. అయితే మెడలో టై కట్టుకొని రావాల్సిందేనని తెలిపింది.వణికించే చలి, హఠాత్తుగా కురిసే వానలకు మారుపేరుగా నిలిచిన బ్రిటన్ ఇప్పుడు యూరప్ ఖండంలోనే అత్యంత వేడి దేశంగా మారింది. జూలై 1, 2015 తర్వాత గత గురువారం 35.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కావడంతో వాతావరణ నిపుణులు అవాక్కయ్యారు. ఎండకు వడగాడ్పులు తోడవడంతో వచ్చే వారం లార్డ్స్ లో ప్రారంభమయ్యే భారత-ఇంగ్లాండ్ జట్ల మొదటి టెస్టు మ్యాచ్ కి జాకెట్ల నిబంధన సడలించాలని ఎంసీసీ నిర్ణయించింది.అయితే ఇది సంప్రదాయ ప్రమాణాలకు నీళ్లొదలడమేననే విమర్శలు వస్తున్నాయి. కొత్త నిర్ణయం గురించి ట్విట్టర్ లో పోస్ట్ చూడగానే ప్రేక్షకుల దగ్గర లినెన్ జాకెట్లు లేవా? ప్రమాణాలు దిగజారుస్తున్నారంటూ పంచ్ లు పడ్డాయి.