జాడ లేని వాన. పంటలకు పొంచి ఉన్న ముప్పు.

హైదరాబాద్:
వరుణుడు రానా వద్దా అంటూ ఊరిస్తున్నాడు. వర్షం కురవక, ఏరు సాగక, వేసిన పంట పచ్చ చేను కాక అన్నదాత ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అదునులో వరుణుడు కరుణించకపోవడంతో రైతన్నలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు మాసాలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో పాటు రానా వద్దా అంటూ దోబూచులాడుతుండంతో రైతన్న దిగాలి పడుతున్నాడు.ప్రభుత్వం నుంచి అందిన పెట్టుబడి ద్వారా వ్యవసాయ సేద్యానికి రైతు ఆరాటపడినా చివరకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుందేమోనని బెంగపడుతున్నాడు. అన్నదాత ఆశలపై కారుచీకట్లు కరువుతో కమ్ముకొనే విధంగా కనిపిస్తుండడంతో రైతు కుటుంబం అంతా దిక్కుతోచని స్థితిలో దిగాలు పడుతోంది. వరుణుడు ఎప్పుడు వస్తాడో అని ఆకాశం వైపు వేచి చూస్తున్నారు.
రెండు ధఫాల విత్తనాల కొనుగోలు
ఈ వర్షాకాల సీజన్‌కు ముందు సీఎం, మంత్రులు, సంబంధిత శాఖ అధికారులు ఈ సీజన్‌లో వర్షాలు విరివిగా కురుస్తాయని ప్రకటించడంతో రైతుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. దీంతో ఉన్న పెట్టుబడికి అదనంగా మరికొంత కలిపి రెండు దఫాల విత్తనాలను ముందస్తుగానే జిల్లా రైతులు కొని పెట్టుకున్నారు.
అందున జూన్ మొదటి వారంలో తొలకరి వర్షాలు అన్నదాతను మురిపించడంతో కోటి ఆశలు పెట్టుకొని భూమిని సేద్యం చేసి పంటలు వేసుకున్నారు. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు తాకకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. జూన్ మాసంలో జిల్లాలో సాధారణ వర్షపాతం 78.06 మి.మి నుండి 118.08 మి.మిగా నమోదైంది. దీంతో జిల్లాలో భారీ వర్షాలకు కొదవ లేదని గంపెడాశలు పెట్టుకున్న రైతుకు కరువు మేఘం కన్నీళ్ళు తెప్పిస్తుంది.
తలలు పట్టుకుంటున్న రైతన్న..
జిల్లాలో అన్ని పంటలకు సాధారణ సాగు విస్తీర్ణం 1,47,561 హెక్టార్లు కాగా 1,89,315 హెక్టార్‌లుగా అధికారులు అంచనా రూపొందించారు. ఈ సీజన్‌లో జిల్లా రైతులు వేసిన పంటల్లో హెక్టార్‌లలో సూమారుగా వరి 85 వేలు, పత్తి 50 వేలు, పెసరు 25 వేలు, కంది 18 వేలు, వేరుశనగ 6 వేలుగా ఉంది. ఈ పంటలపై వర్షాభావ ప్రభావం స్పష్టంగా కనపడుతుంది.
మరో పది రోజులు ఇలాగే ఉంటే సూమారు 50 శాతం పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రస్తుతం వరి నారు పోసుకున్న వారంత బోరుబావి కింద ఉన్న రైతులే ఎక్కువగా ఉండడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా మంత్రులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపి రైతన్నకు కాల్వల ద్వారా నీటిని అందించాలని రైతులు కోరుకుంటున్నారు.