‘జీఎస్టీ’ సరళంగా ఉండాలి.

న్యూఢిల్లీ:
భారత పన్ను విధానంలో జీఎస్టీ అమలు మైలురాయి సంస్కరణగా నిలిచిపోతుందని ఐఎంఎఫ్ ప్రశంసించింది. రాష్ట్రాలు, కేంద్రం విధించే అనేక పరోక్ష పన్నులను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు పడిందని వ్యాఖ్యానించింది. కానీ జీఎస్టీని సరళీకరించాలని సూచించింది. ఇప్పుడున్న బహుళ రేటు వ్యవస్థ, ఇతర విధానాలు సంక్లిష్టంగా ఉన్నాయని, వీటితో పాలనాపరమైన ఖర్చులు అధికమవుతాయని అభిప్రాయపడింది. జీఎస్టీని రెండు రేట్లుగా ఉంచాలని చెప్పింది. ప్రామాణిక రేటుని తగ్గించి, కొన్ని వస్తువులపై అదనంగా ఎక్కువ రేటు విధించడం వలన పురోగమన దిశగా తీసుకెళ్తుందని.. ఆదాయ తటస్థతను కాపాడుతుందని తెలిపింది.
దేశంలోని వస్తు, సేవలపై విధించే పరోక్ష పన్ను జీఎస్టీ, గత ఏడాది జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. పేదవారితో పోలిస్తే వినియోగం అధికంగా ఉండే సంపన్నులపై అధిక పన్నులు విధిస్తూ జీఎస్టీని రూపొందించారని చెప్పింది. ఈ పన్నుతో ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాల్లో లావాదేవీల పరిమాణం పెరుగుతుందని, దీనివల్ల మెరుగైన నాణ్యత, స్థిరమైన ఉద్యోగాలు లభిస్తాయని భారత ఐఎంఎఫ్ మిషన్ చీఫ్ రణిల్ సల్గాడో తెలిపారు. జీఎస్టీతో ఉత్పాదకత మెరుగై ప్రభుత్వానికి సామాజిక, మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు సమకూరుతాయని చెప్పారు.