జూన్ 10 నాటికి పంచాయ‌తీల‌ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు.

రిజ‌ర్వ్‌ స‌ర్పంచ్ స్థానాల సంఖ్య‌ను జిల్లాల‌వారీగా ప్ర‌క‌టించ‌నున్న‌ పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్.
జిల్లా స్థాయిలో రిజ‌ర్వ్ వార్డు మెంబ‌ర్ల సంఖ్య‌ను ప్ర‌క‌టించ‌నున్న క‌లెక్ట‌ర్‌.
పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్ష‌:

హైద‌రాబాద్‌:

జూన్ 10 నాటికి పంచాయ‌తీ ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించేందుకు పంచాయ‌తీరాజ్ శాఖ సిద్ద‌మౌతోంది. ఈ నెలాఖ‌రులోగా బీసీ ఓట‌ర్ల గ‌ణ‌న‌ను పూర్తి చేసి… వ‌చ్చే నెల 10 లోపు స‌ర్పంచ్‌, వార్డు స్థానాల రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌, హ‌రిత‌హారం, ఎల్ ఈ డీ వీధి దీపాల ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌పై తెలంగాణా గ్రామీణాభివృద్ధి సంస్థ‌లో ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌, ఇత‌ర అధికారుల‌తో పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. 2011 గ్రామీణ జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల‌ను ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు అధికారులు వివ‌రించారు. అలాగే ప్ర‌స్తుతం బీసీ ఓట‌ర్ల గ‌ణ‌న జ‌రుగుతుందని, నెలాఖ‌రులోగా ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. జూన్ 10 నాటికి జిల్లాల‌వారీగా స‌ర్పంచ్ స్థానాల రిజ‌ర్వేష‌న్ల సంఖ్య‌ను రాష్ట్ర‌స్థాయిలో పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్‌, వార్డుమెంబ‌ర్ల సంఖ్య‌ను జిల్లా స్థాయిలో మండ‌లాల‌వారీగా క‌లెక్టర్లు ఖ‌రారు చేయ‌నున్నారు. ఈ ప్ర‌క్రియ‌ను పార‌ద‌ర్శ‌కంగా పూర్తి చేయాల‌ని అధికారుల‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సూచించారు.

ఊరూరా న‌ర్స‌రీల ఏర్పాటు

*జూన్ 10 లోగా న‌ర్స‌రీ ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభించాలి*

*జులై 15 నాటికి న‌ర్స‌రీల ఏర్పాటు పూర్తి కావాలి*

*వెయ్యికి పైగా జ‌నాభా ఉన్న గ్రామాల్లో ల‌క్ష మొక్క‌ల న‌ర్సరీ*

*అంత‌కు త‌క్కువ జ‌నాభా ఉంటే 50 వేల‌ మొక్క‌ల‌తో న‌ర్స‌రీల ఏర్పాటు*

పంచాయ‌తీరాజ్ నూత‌న చ‌ట్టం ప్ర‌కారం ప్ర‌తి గ్రామంలో న‌ర్స‌రీల ఏర్పాటు పంచాయ‌తీల బాధ్య‌త‌ని…ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ సిద్దం చేసుకోవాల‌ని అధికారుల‌ను మంత్రి జూప‌ల్లి ఆదేశించారు. జూన్ 10 లోగా న‌ర్స‌రీ ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని… జులై 15 నాటికి న‌ర్స‌రీల ఏర్పాటు పూర్తి కావాల‌న్నారు. ఇప్ప‌టికే దాదాపు 3 వేల‌కు పైగా గ్రామాల్లో న‌ర్స‌రీలున్నాయ‌ని…మిగిలిన గ్రామాల్లోనూ వెంట‌నే స్థ‌ల సేక‌ర‌ణ చేసి న‌ర్స‌రీల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. వెయ్యికి పైగా జ‌నాభా ఉంటే ల‌క్ష మొక్క‌లతో… వెయ్యి క‌న్నా త‌క్కువ‌ జ‌నాభా ఉంటే 50 వేల మొక్క‌ల‌తో న‌ర్స‌రీలను ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌ధానంగా ఎక్కువ కాలం మ‌నుగ‌డ ఉండే మొక్కలతో పాటు పూలు, పండ్ల మొక్క‌ల‌ను న‌ర్స‌రీల్లో సిద్దం చేయాల‌న్నారు. వీటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త పూర్తిగా గ్రామ పంచాయ‌తీల‌కే అప్ప‌గించాల‌న్నారు. న‌ర్సీరీల నిర్వ‌హ‌ణ‌కు ఉపాధి కూలీని నియ‌మించుకునే వెసులు బాటు క‌ల్పించాల‌న్నారు. పంచాయ‌తీ తీర్మాణానికి అనుగుణంగా ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియ‌మించుకునేందుకు వీలు క‌ల్పించేలా నిబంధ‌న‌ల్లో మార్పు చేయాల‌న్నారు. పంచాయ‌తీల ఆదాయ‌, వ్య‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు…ఫీల్డ్ అసిస్టెంట్లు స‌రిగా ప‌నిచేయ‌క‌పోతే ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసే అంశాన్ని కూడా పరిశీలించాల‌ని సూచించారు.విద్యుత్ ఆదా జ‌రిగేలా ప్రతి పంచాయ‌తీలోనూ ఎల్ ఈ డీ వీధి దీపాల ఏర్పాటుపై దృష్టి సారించాల‌న్నారు. అలాగే ప్ర‌తి గ్రామంలోనూ పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాల‌ని…ఇప్ప‌టికే గ్రామాల‌కు ఇచ్చిన చెత్త సేక‌ర‌ణ ట్రై సైకిళ్ల‌ను స‌ద్వినియోగంలోకి తేవాలన్నారు.