జూరాలకు వరద: తెరుచుకున్న నారాయణపూర్‌, తుంగభద్ర.

మహబూబ్ నగర్:
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నారాయణపూర్‌, తుంగభద్ర ప్రాజెక్టుల గేట్లు తెరిశారు. ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నారాయణపూర్‌ నీరు జూరాల చేరనుంది. తుంగభద్ర నుంచి ఒకట్రెండు రోజుల్లో శ్రీశైలానికి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తిగా నిండిన ఆల్మట్టికి ప్రస్తుతం 30,900 క్యూసెక్కుల వరద వస్తుండగా ఆ నీటిని అలాగే దిగువకు వదిలేస్తున్నారు. దీంతో దిగువనున్న నారాయణపూర్‌లోకి 30 వేల క్యూసెక్కుల వరద చేరుతుంది. అక్కడి నుంచి ఏడు గేట్లు ఎత్తి 22,240 క్యూసెక్కుల నీరు దిగువన ఉన్న జూరాలకు వదులుతున్నారు. జూరాలలో 9.66 టీఎంసీలకుగానూ 7.89 టీఎంసీల నీరుంది. 16 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 5,860 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల పథకాల అవసరాలకు విడుదల చేస్తున్నారు.తుంగభద్రకు వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం 21,483 క్యూసెక్కుల ప్రవాహం రాగా మూడు గేట్లు ఎత్తి 18,452 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్రలో 100 టీఎంసీల నిల్వకుగానూ 98.20 టీఎంసీల నీరుంది. శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వకుగానూ 144.11 టీఎంసీలున్నాయి. సాగర్‌కు శ్రీశైలం నుంచి 23,768 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో సాగర్‌లోకి 17,643 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్‌లో 144.04 టీఎంసీల నీరుంది.