‘జెట్ ఎయిర్ వేస్’ లో టాటాల పెట్టుబడులు.

న్యూఢిల్లీ:
పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌‌‌లో భారీ వాటా కొనేందుకు దేశ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అంతర్గత విషయాలు తెలిసిన విశ్వసనీయ వర్గాలు దీనిని ధృవీకరించినట్టు ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనాన్ని ప్రచురించింది.నరేష్ గోయల్‌కు చెందిన జెట్ ఎయిర్‌వేస్ నిండా అప్పుల్లో మునిగిపోయింది. ఉద్యోగులకు, పైలెట్లకు సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. దీంతో జెట్ ఎయిర్‌వేస్ సంస్థలో వాటా అమ్మేందుకు సిద్ధమైంది. ఇందుకోసం బడా సంస్థల కోసం చాలాకాలంగా అన్వేషిస్తోంది. అయితే మేనేజ్‌మెంట్ పగ్గాలు తమకు అప్పగించే షరతుపైనే వాటాల కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ పేరెంట్ కంపెనీ టాటా సన్స్ భావిస్తోంది.టాటాలు రెండు జాయింట్ వెంచర్లతో ఇప్పటికే విమానయాన రంగంలో కాలు మోపారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారా, మరో బడ్జెట్ ఎయిర్‌లైనర్ ఎయిర్ ఏషియాలను నిర్వహిస్తోంది. ఫుల్ సర్వీసెస్ క్యారియర్ అయిన విస్తారా జెట్ ఎయిర్‌వేస్ తో పోటీ పడుతోంది. జెట్ ఎయిర్‌వేస్‌తో ఒప్పందం కుదిరితే టాటాల దగ్గర ఎక్కువ రూట్లలో ఎక్కువ విమానాలు నడిపి ఎక్కువ మార్కెట్ షేర్ సాధించే వీలు కలుగుతుంది. దీంతో విమానయాన రంగంలో టాటా గ్రూప్ బలమైన శక్తిగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది. ఈ ఒప్పందంపై రెండు సంస్థలకు ఆసక్తి ఉన్నప్పటికీ..వాటాల కొనుగోలు తర్వాత మేనేజ్‌మెంట్ పగ్గాలు ఎవరి దగ్గర ఉండాలి, జెట్ ఎయిర్‌వేస్ ఛైర్మన్ నరేష్ గోయల్‌ పాత్ర ఏంటనే విషయంలో సందిగ్ధత నెలకొంటున్నట్లు సమాచారం. ఇంతకు ముందు కూడా టీపీజీతో చర్చల సందర్భంగా కంట్రోలింగ్ రైట్స్ దగ్గర పీటముడి పడి ఆగిపోయింది. ప్రస్తుతం నరేష్ గోయల్, ఆయన భార్య అనితకు జెట్ ఎయిర్‌వేస్‌లో 51% వాటా ఉంది. ఇందులో టాటా గ్రూప్ కనీసం 26% వాటాల కొనుగోలు చేయాలనుకుంటోంది. మిగతా 26% ఇతర షేర్ హోల్డర్ల నుంచి కొనే అవకాశం ఉంది. జెట్ లో ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కి 24% వాటా ఉంది.