‘జెస్సికా లాల్’ హంతకుడ్ని విడిచిపెట్టం. – ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం.

ప్రకాశ్, న్యూఢిల్లీ:
మోడల్ జెస్సికా లాల్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మను శర్మను వదిలేది లేదని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. త్వరగా విడుదల చేయాలని మను శర్మ పెట్టుకొన్న అర్జీని సెంటెన్స్ రివ్యూ బోర్డు తిరస్కరించింది. జెస్సికాలాల్ ను 20 ఏప్రిల్ 1999న ఢిల్లీలోని ఒక బార్ లో అప్పటి కాంగ్రెస్ నేత వినోద్ శర్మ కుమారుడు మను శర్మ కాల్చి చంపాడు. మను శర్మతో పాటు ప్రియదర్శిని మట్టు హత్య కేసులో దోషి సంతోష్ సింగ్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తందూర్ హత్య కేసులో దోషి సుశీల్ శర్మ కూడా త్వరగా విడుదల చేయాలని పెట్టుకున్న పిటిషన్లను ఢిల్లీ సెంటెన్స్ రివ్యూ బోర్డు తోసి పుచ్చింది. వీటిని పరిశీలించడానికి నిరాకరించింది.డిసెంబర్ 2006లో ఢిల్లీ హైకోర్ట్ మను శర్మను దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మను శర్మ దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్లింది. ఏప్రిల్ 2010లో అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పుని సమర్థించింది. ప్రస్తుతం మనుశర్మ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.1996 జనవరి 23న 25 ఏళ్ల లా విద్యార్థిని ప్రియదర్శిని మట్టుని రేప్ చేసి హత్య చేశారు. 2006 అక్టోబర్ లో ఢిల్లీ హైకోర్ట్ సంతోష్ కుమార్ ని దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ జైలు శిక్ష విధించింది. నాలుగేళ్ల తర్వాత 2010లో సుప్రీంకోర్ట్ కూడా ఈ తీర్పుని ఆమోదించింది.జూలై 1995లో కాంగ్రెస్ కార్యకర్త నైనా సాహ్నీని వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఆమె భర్త..ఎమ్మెల్యే సుశీల్ శర్మ హత్య చేసి ఒక రెస్టారెంట్ లో తందూర్ లో శరీర భాగాలను దగ్ధం చేశాడు. 2013 అక్టోబర్ 8న సుప్రీంకోర్ట్ సుశీల్ కుమార్ కు జీవిత ఖైదు విధించింది.