జోగు, ఇంద్రకరణ్ ఎదురీత!! ఎమ్మెల్యేలపై వ్యతిరేకత. అంతటా గ్రూపుల పోరు. పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి

పది అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రూపులతో సతమతమవుతోంది. ఒకట్రెండు చోట్ల అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా తమను నిర్లక్ష్యం చేశారన్న భావనతో అనేకమంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులు, అనుచరుల ప్రవర్తన పట్ల కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. వారి ‘విచ్చలవిడితనం’తో ప్రజలలో అధికారపార్టీ పై వ్యతిరేకత వచ్చినట్టు టిఆర్ ఎస్ అధ్యక్షుడు అభిప్రాయపడుతున్నారు. ఈ వాతావరణం అంతిమంగా ప్రభుత్వం పై వ్యతిరేకతగా మారుతున్నట్టు టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావన.

ఆదిలాబాద్;
మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలకు పరిస్థితులు సానుకూలంగా లేవని తెలుస్తున్నది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి అనుకున్నంత సజావుగా లేదని అధిష్టానం గుర్తించినట్టు సమాచారం అందింది. ఈ రెండు చోట్ల పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయము లేదు. గ్యాప్ పెరిగిపోయింది. చాలామంది టిఆర్ ఎస్ నాయకులు క్రియాశీలంగా లేరు. ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి కనిపిసున్నది. ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాలలోనూ మూడేసి గ్రూపులు కొనసాగుతున్నవి. సిట్టింగ్‌ శాసనసభ్యులకు వ్యతిరేకంగా కొన్ని వర్గాలు పనిచేస్తున్నవి. బోథ్‌,ఆసిఫాబాద్‌,సిర్పూరు నియోజకవర్గాలలోనూ గ్రూపు రాజకీయాలు పతాకస్థాయికి చేరుకున్నవి. మంచిర్యాల, చెన్నూరు,బెల్లంపల్లిలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అయిదు నియోజకవర్గాలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఇబ్బందికర వాతావరణం ఉన్నట్టు కేసీఆర్ అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఖానాపూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌, చెన్నూరు నియోజకవర్గాలలో కొందరు ‘ఆశావహుల’ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతున్నది. ఈ నియోజకవర్గాలలో ఇతర పార్టీల్లోని బలమైన నేతల వివరాలను కేసీఆర్ ‘ వేగులు’ ఇప్పటికే సేకరించారు. అవసరమైతే వారిని పార్టీలో చేర్చుకునే అంశాన్ని ఆలోచిస్తున్నారు. దీంతో ఎన్నికలలో గెలుస్తామా? ఓడుతామో అన్నదాని కంటే అసలు టికెట్‌ వస్తుందా? రాదా అన్న టెన్షన్ ప్రస్తుత అధికారపార్టీ ఎమ్మెల్యేలలో కనిపిస్తున్నది. అధికారపక్షంలో ‘సర్వేల’ ప్రకంపనలు కనిపిస్తున్నవి.’ సిట్టింగ్‌లకే టిక్కెట్ల’న్న అధిష్టానం మనసు మారిందని అధికారపక్షం కార్యకర్తలు అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ‘ప్రత్యామ్నాయ’ నేతల కోసం అంతర్గతంగా అన్వేషణ సాగుతున్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార పక్షంలో ప్రచారం ఉన్నది. వందకు పైగా అసెంబ్లీ స్థానాలు,16 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్న ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌పార్టీ విపక్షాలకు సవాళ్లు విసురుతోంది. ఒకట్రెండు చోట్ల తప్పిస్తే సిట్టింగ్‌లందరికీ టికెట్లు గ్యారంటీ అని కేసీఆర్‌ పదే పదే చెప్పారు. కానీ కొందరు ఎమ్మెల్యేల తీరు పార్టీకి నష్టం తీసుకురానున్నట్టు టిఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. అలాంటివారికి మళ్లీ టికెట్‌ ఇస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉన్నట్టు కేసీఆర్ భావన. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిని అంచనా వేయడం కోసం ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిఘా విభాగాలకు తోడు. వివిధ ప్రయివేటు సంస్థలు నిరంతరం సర్వేలు చేస్తున్నాయి. కొన్ని సర్వే రిపోర్టులను స్వయంగా ప్రస్తావించి కేసీఆర్ కొందరు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేశారు. పరిస్థితి చేయిదాటిపోతున్నందున ఇక హెచ్చరికలతో పనిలేకుండా గెలుపు అవకాశం ఉన్నవారికి మాత్రమే సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్టు ఖరారు చేయనున్నట్టు తెలియవచ్చింది. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినా కొన్ని నియోజకవర్గాలలో పార్టీకి ఆశించిన ‘మైలేజ్‌’ రావడం లేదు.దీనికి తోడు పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి నివురు గప్పిన నిప్పు వలె ఉన్నది. ఈ పరిణామాలు ఎన్నికల నాటికి పార్టీకి భారీ నష్టం చేస్తాయని కేసీఆర్ అంచనా. క్షేత్రస్థాయి నుంచే పార్టీ ప్రక్షాళన చేయాలని ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసే పని కూడా మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఏడు, పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.ఈ పది అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రూపులతో సతమతమవుతోంది. ఒకట్రెండు చోట్ల అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా తమను నిర్లక్ష్యం చేశారన్న భావనతో అనేకమంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులు, అనుచరుల ప్రవర్తన పట్ల కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. వారి ‘విచ్చలవిడితనం’తో ప్రజలలో అధికారపార్టీ పై వ్యతిరేకత వచ్చినట్టు టిఆర్ ఎస్ అధ్యక్షుడు అభిప్రాయపడుతున్నారు. ఈ వాతావరణం అంతిమంగా ప్రభుత్వం పై వ్యతిరేకతగా మారుతున్నట్టు టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావన. భూకబ్జాలు, బెదిరింపుల వంటి అంశాలతో పాటు కొందరి వ్యక్తిగత ప్రవర్తన కూడా పార్టీకి నష్టం కలిగించినట్టు సర్వేలలో తేలినట్టు సమాచారం అందింది. సంక్షేమ పథకాల మంజూరులో అవినీతి, బదిలీలు, పోస్టింగ్‌లలో లంచాలు తీసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నవి. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ‘సెటిల్‌మెంట్ల’కు గాను ఎమ్మెల్యేలు తమ ఏజెంట్లను నియమించుకున్నట్టు కేసీఆర్ దృష్టికి వెళ్లినట్టు తెలుస్తున్నది.