హైదరాబాద్:
ప్రతి పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి నియామకంతో పాటు,జనాభా ప్రాతిపదికన గ్రామంలో ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు హాజరయ్యారు. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయడానికి ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించాలని సీయం కేసీఆర్ నిర్ణయించారన్నారు. 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక గైడ్ లైన్స్ పై సబ్ కమిటీ కూలంకుశంగా చర్చించింది. డిగ్రీ విద్యార్హతతో పాటు… కొత్త జిల్లాల ప్రాతిపదికన వీరి నియామకం చేపట్టాలని నిర్ణయించింది. వీరికి మూడేళ్ల పాటు 15 వేల వేతనం ఇవ్వాలని.. పనితీరు సరిగా ఉంటేనే మూడేళ్ల తర్వాత రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించారు. వ్రాతపరీక్ష ఆధారంగా జిల్లాల వారీగా నియామకాలు చేపట్టాలని, ఖచ్చితంగా గ్రామాల్లోనే ఉండాలనే నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే నియామకాల్లో వయస్సుకు కొంత వెయిటేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. వీరి పదోన్నతుల్లో సీనియారిటీతో పాటు… పనితీరును కూడా ప్రాతిపదికగా తీసుకునేందుకు ఉన్న అవకాశాలపైనా సబ్ కమిటీ చర్చించింది. పంచాయతీల్లో పనిచేసే ప్రతి కార్మికునికి, సిబ్బందికి కనీస వేతనం ఇవ్వడంతో పాటు…ప్రతి నెలా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ ఆదేశించింది.
అలాగే జనాభా ప్రాతిపదికన ఏ గ్రామానికి ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉంటుందన్న సంఖ్యను ఖచ్చితంగా తేల్చాలని సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రామపంచాయతీలు కూడా ఇష్టానుసారంగా సిబ్బందిని నియమించుకునేందుకు వీలు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు వందల వరకు జనాభా ఉన్న గ్రామానికి ఒక పారిశుధ్యకార్మికున్ని నియమించుకునేలా పంచాయతీలకు వెసులుబాటు ఇచ్చే అంశంపై చర్చించారు. వీటిలో పాటు గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రాధాన్యత క్రమాన్ని కూడా స్పష్టంగా నిర్దేశించాలని నిర్ణయించారు. వీటితో పాటు నూతన చట్టానికి అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారులు, డివిజన్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓ పీఆర్డీలు, కార్యదర్శుల సర్వీస్ రూల్స్‌లోనూ మార్పులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం బీసీ గణన చేపట్టాల్సిన అవసరం ఉందని…దీని విధి విధానాలు సిద్దం చేయాలని అధికారులకు సబ్ కమిటీ సూచించింది. సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావు, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.