టిఆర్ఎస్ నేత వేధింపులు. మహిళ ఆత్మహత్య.

మహబూబ్‌నగర్‌:

జిల్లా కేంద్రంలోని ఓ మహిళ ఆత్మహత్య వివాదాస్పదమైంది. జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన పద్మ (48) గత నెల 27న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పు అంటించుకున్నారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. చికిత్స సమయంలో కుమారుడి మృతి తర్వాత మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకుడి వేధింపుల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసిందని అప్పట్లోనే జోరుగా ప్రచారం సాగింది. ఆమె మృతి చెందిన తర్వాత ఆమె తరఫు బంధువులు అధికార పార్టీకి చెందిన నేత వేధింపుల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసిందని, చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులకు బుధవారం మౌఖికంగా ఫిర్యాదు చేశారు. గురువారం రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని తెలిపినట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. న్యాయమూర్తికి పద్మ ఇచ్చిన వాంగ్మూలంను గురువారం ఉదయం తీసుకొని దాని ప్రకారం కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ పద్మ బంధువులకు చెప్పారు. ఈ కేసులో న్యాయమూర్తికి పద్మ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారనుంది