టిఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టో రేపు విడుదల.

హైదరాబాద్:
టిఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో కమిటీ సమావేశం మంగళవారం మద్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్ లో జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై ఈ సమావేశంలో చర్చిస్తామని మానిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు చెప్పారు. ముఖ్యమైన సమావేశం అయినందున మానిఫెస్టో కమిటీ సభ్యులంతా సమావేశానికి తప్పక హాజరుకావాలని కేశవరావు కోరారు. ఇప్పటికే అభ్యర్థులు ప్రజల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నందున, వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చే హామీలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని టిఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. అందుకే పూర్తి మానిఫెస్టో సిద్ధమయ్యే లోగా, ఇప్పటికే నిర్ణయించిన కొన్ని ముఖ్యమైన హామీలను వెల్లడించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మంగళవారం జరిగే మానిఫెస్టో కమిటీ సమావేశంలో చర్చించి, పాక్షిక మానిఫెస్టో ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. కేసీఆర్ స్వయంగా పాక్షిక మానిఫెస్టోను ప్రకటిస్తారు.