టిఆర్ఎస్ పై తెలంగాణ జర్నలిస్టుల తిరుగుబాటు:

press

హైదరాబాద్:

తెలంగాణలో జర్నలిస్టులంతా టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొందరు జర్నలిస్టులు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ర్యాలీ అయ్యారు. తెలంగాణ జర్నలిస్టులను టిఆర్ఎస్ సర్కారు వంచించిందని, మాయ మాటలతో మోసం చేసి నాలుగున్నరేళ్లు పబ్బం గడుపుకుందని జర్నలిస్టులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తెలంగాణ జర్నలిస్టుల తిరుగుబాటు గురించిన వివరాలు ఇవీ.తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అన్న నినాదంతో ఉప్పిడి ఉండి, ఉపాస‌ముండి జర్నలిస్టులు ఉద్యమంలో అగ్రభాగాన నిలిచారు. తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోశించారు. ఉద్యమ కాలంలో జర్నలిస్టులంతా సంఘం ఏదైనా టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారు. కానీ తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత అన్ని వర్గాల మాదిరిగా తెలంగాణ జర్నలిస్టులు కూడా తమకు మేలు జరుగుతుందేమోనని ఆశించారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు.దీంతో పలువురు సీనియర్ జర్నలిస్టులు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాలకు అతీతంగా పాల్గొన్నారు. సమావేశంలో టిఆర్ఎస్ సర్కారు జర్నలిస్టులను దారుణంగా మోసం చేసిందని మాట్లాడిన నేతలు విమర్శించారు.


తెలంగాణ వచ్చిన తర్వాత జర్నలిస్టుల బతుకులు పెంక మీంచి పొయిలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ హామీ కూడా అచ్చంగా అమలు కాలేదని సీరియస్ అయ్యారు. టిఆర్ఎస్ సర్కారు ఇచ్చిన జర్నలిస్టుల హెల్త్ కార్డులు నాలుక గీక్కునేందుకు కూడా పనికొస్తలేవని విమర్శించారు. టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వకుండానే మేనిఫెస్టో మొత్తం అమలు చేశామంటూ టిఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్, టియుడబ్ల్యూజె రాష్ట్ర ఉపాధ్యక్షులు జమాల్పూర్ గణేష్ మాట్లాడుతూ కేసిఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఆయన ఇంకా ఏమన్నారంటే… ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ యు దాకా అన్ని వర్గాలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపించిన ఘనత తెలంగాణ జర్నలిస్టులకే దక్కింది. ఉస్మానియాలో విద్యార్థుల పోరాటం చేస్తున్న క్రమంలో వారికి లాఠీల దెబ్బలు తగలకుండా మా కెమెరాలు అడ్డం పెట్టి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్నాము. ఇంతకాలం జర్నలిస్టులు మౌనంగా ఉన్నారు.. కానీ ఆ మౌనాన్ని బద్ధలు కొట్టేందుకే ఇవాళ సమావేశం జరిపినం. ఉద్యమకాలంలో తెలంగాణ జర్నలిస్టులు రాతలకే పరిమితం కాలేదు. ఉద్యమాన్ని రగిలించినం. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అని నినదించినం. కానీ తెలంగాణలో టిఆర్ఎస్ సర్కారు జర్నలిస్టులకు చేసిందేమీ లేదు. అందుకే తెలంగాణ రక్షణ, పరిరక్షణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజల వైపే నిలబడ్డ చరిత్ర తెలంగాణ జర్నలిస్టులది. ఆ చరిత్ర పునరావృతమయ్యితీర్తది అని గణేష్ అన్నారు. ఈ సమావేశం ఏ జర్నలిస్టు సంఘాలకు వ్యతిరేకం కాదని, ఇది సంఘం కూడా కాదని, సమాజం పట్ల బాధ్యత గల జర్నలిస్టుల వేదిక మాత్రమే అని జమాల్ పూర్ గణేష్ అన్నారు.

ఆనాడు బాగ్ లింగంపల్లిలో పురుడుపోసుకున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆరంభ సమావేశాల్లో పట్టుమని పది మంది కూడా లేరని, తర్వాత ఆ సంగమే తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోశించింది. నేడు తెలంగాణ జర్నలిస్టులంతా టిఆర్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్నారన్న విమర్శలకు చరమగీతం పాడేందుకే సమావేశం జరిపినం. మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయకుండా జర్నలిస్టులను కేసిఆర్ సర్కారు మోసం చేసింది. పాల పాకెట్ల బ్యాచ్ లో లేమని సీనియర్ జర్నలిస్ట్అమర్ చెప్పారు.అయినదానికి కాని దానికి తెలంగాణలో పాల పాకీట్లు కట్ చేసి కుమ్మరిచ్చే బ్యాచ్ తయారైంది. ఆ బ్యాచ్ లో కొందరు జర్నలిస్టులు కూడా చేరడం బాధాకరం. మనం మాత్రం పాల పాకీట్ల బ్యాచ్ లో ఉండకుండా బయటపడ్డాము. సంతోషకరం. తెలంగాణలో జర్నలిస్టులం శాసించే స్థితికి చేరాలి. టిఆర్ఎస్ చేసిందేమీ లేదు. కాబట్టి కూటమి నేతలను కలిసి స్పష్టమైన హామీలు తీసుకోవాలి. వారు అధికారంలోకి వస్తే ఆ హామీల అమలు కోసం గట్టిగా ఫైట్ చేయాలి. ఇప్పటిలాగా నాలుగున్నరేళ్లు ఎదురుచూసి మోసపోవద్దు. ఇతర రాష్ట్రాల పత్రికలకు వందల కోట్ల యాడ్స్ ఇచ్చారు కానీ తెలంగాణలో ఉన్న స్థానిక పత్రికలకు మాత్రం చిన్నచూపు చూశారు. ఇది చాలా దారుణం. జర్నలిస్టులు ఏపార్టీలకు తొత్తులుగా ఉండరని మధు అన్నారు.తెలంగాణ జర్నలిస్టులంతా టిఆర్ఎస్ కు అనుకూలం అనే భావన తప్పు. కొందరు టీఆరెస్ కు అనుకూలమైతే కావచ్చు కానీ జర్నలిస్టులెప్పుడూ ప్రజలవైపే ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలో జర్నలిస్టులకు ఎన్ని ఒత్తిడులు, బెధిరింపులు వచ్చినా ప్రజలవైపే నిలబడ్డ చరిత్ర ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో అంతర్మథనం సాగుతున్నది. నిశబ్ధాన్ని బద్దలు కొట్టడం ఖాయం.పోరాటాలు మరచిపోయి చాలారోజులైంది, రుచి చూపిద్దామని అమిత్ అన్నారు.”తెలంగాణ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోశించాము. ఉస్మానియాలో స్టూడెంట్స్ ను కొడుతూ మనల్ని కూడా కొట్టారు పోలీసులు. మన పోరాటాలేందో అప్పడు ఉమ్మడి సర్కారుకు రుచి చూపించినం. ఇప్పుడు సొంత సర్కారుకు రుచి చూపిద్దాం. మరచిపోయిన పోరాటాలను మళ్లీ షురూ చేద్దాం. మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరుబాట తప్పదు. ఆంధ్రా యాజమాన్యాల వత్తిళ్లను తట్టుకుని తెలంగాణ కోసం పనిచేసినవాళ్లకు టిఆర్ఎస్ పల్లకీ మోయాల్సిన పనిలేదు. కేసిఆర్ సర్కారు ఇచ్చిన హెల్త్ కార్డులు ఎక్కడా పనిచేయడంలేదు. ఆ కార్డులు చూసుకుని మురుసుడు తప్ప మనకు ఒరిగిందేమీ లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1.జర్నలిస్టుగా పనిచేసే వారందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి.
2.చిన్నపత్రికలు అని చిన్నచూపు చూడకుండా ప్రకటనలు ఇవ్వాలి.
3.నాన్ వర్కింగ్ జర్నలిస్టులందరికీ పనిచేసే హెల్త్ కార్డులు ఇవ్వాలి.
4.కొత్త సర్కారు వచ్చిన తొలి ఏడాదిలోనే అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.
5.జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి.
6.జర్నలిస్టుల‌ సమస్యలను ప్రతి పార్టీ తమ మేనిఫెస్టోలో పొందుపరిచేలా అన్ని పార్టీలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. గత మేనిఫెస్టో అమలు చేయకపోయినా సరే టిఆర్ఎస్ పార్టీకి కూడా వినతిపత్రం సమర్పించాలని అనుకున్నారు.
సమావేశంలో సంతోష్, సంజీవ్, రామకృష్ణ, విజయ్, ఆంజనేయులు, సాయి ప్రసాద్, రాజ్ కిరణ్, నాగరాజు తదితరులు మాట్లాడారు.