టీఆర్ఎస్ అభ్యర్థులకు అసమ్మతి ‘గండం’.

మహబూబ్‌నగర్‌:

టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెస్‌, తెదేపా నేతలు అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల కదలికలను గమనిస్తున్నారు. ఓట్ల కోసం వారు ఎక్కడికిపోతే అక్కడికి తెల్లారేసరికల్లా వాలిపోతున్నారు. వారి మాటలు నమ్మవద్దని, మరిన్ని తాయిలాలు ప్రకటించడానికి వీరూ సిద్ధం అవుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీలో ఉన్న అసంతృప్తివాదులపై దృష్టి సారిస్తున్నారు. బయట ఎలా ఉన్నా ఎన్నికల నాటికి తమకే ఓటు పడేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవరసమైతే క్రాస్‌ ఓటింగు చేసేలా హామీలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి టికెటును ఆశిస్తున్న ఓ సీనియర్‌ నేత అధికార పార్టీకి చెందిన అభ్యర్థి ఎక్కడికి వెళితే అక్కడికి తెల్లారేసరికల్లా వాలిపోతున్నారు. కనీసం స్వపక్షంలోని నేతలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. చెబితే ఎక్కడ అవతలివారికి లీకై సర్దుపాటు చేసుకుంటారోనన్న భయం వారిని వెంటాడుతోంది. అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ భాజపా చాప కింద నీరులా ప్రచారం నిర్వహిస్తోంది. ఆ పార్టీకి ఉన్న పోలింగు బూత్‌లు, శక్తి కేంద్రాల ద్వారా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక్కో కార్యకర్తకు కొన్ని కుటుంబాలు అప్పగించడంతో వీరు తరచూ ప్రజలను కలుస్తూ భాజపా వైపు మొగ్గు చూపి ఓటు వేసేలా ప్రచారం సాగిస్తున్నారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరాస అభ్యర్థుల ప్రచారశైలి ఉన్నపళంగా మారిపోయింది. ఇపుడంతా రహస్యంగా కొనసాగుతోంది. ముందుగా చెప్పకుండానే అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఏ రోజున ఎక్కడికి వెళ్లేది బయటకు పొక్కడం లేదు. సాధారణంగా ఎన్నికలంటేనే ప్రచారహోరు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా తెరాస టికెట్లు మాత్రమే ఖరారైన విషయం తెలిసిందే. కొన్నిచోట్ల అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి స్పందన కరవుతోంది. మరికొన్నిచోట్ల ప్రత్యర్థులు ముందుగానే పసిగట్టి అక్కడున్న అసమ్మతిని మరింత రాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లేని తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రచారం గురించి మీడియాకు కూడా ముందుగా సమాచారం ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లా అంతటా దాదాపు సగం మంది అభ్యర్థులు ఇలా రహస్యంగానే ఓట్ల కోసం ప్రజల ముందు మోకరిల్లుతున్నారు. అధికార పార్టీ తెరాస ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. వారంతా ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించిన విషయం విదితమే. మొదట్లో రెండు మూడు రోజులు బైకు ర్యాలీలు, సమావేశాలతో హంగామా చేశారు. తర్వాత ఈ సరళిని మార్చుకున్నారు. గులాబీ దళంలోని మెజారిటీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని రహస్యంగానే కొనసాగిస్తున్నారు. కులసంఘాలు, కాలనీ సంఘాలు, బస్తీ సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అసమ్మతివాదుల ఇళ్ల మెట్లు ఎక్కుతున్నారు. ఎక్కడైనా అసంతృప్తి బయటపడితే అది మీడియా వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఓ నియోజకవర్గంలోని బస్తీకి తెరాస అభ్యర్థి వెళితే ప్రజల్లో స్పందన కరవైంది. అభ్యర్థి తాను చేసిన అభివృద్ధి పనులు ఏకరవు పెడుతుంటే.. అక్కడి నుంచి ప్రజలు వెళ్లిపోయారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మరో అభ్యర్థి అసమ్మతివాదులను బుజ్జగించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వారిని మచ్చిక చేసుకోడానికి తానంతట తానే తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లº కూడా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని గెలుపు తమదంటే తమదని తాయిలాలు ప్రకటిస్తున్నారు. సాయంత్రం కాగానే వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా ప్రచారానికి సంబంధించిన ఫొటోలను మీడియాకు పంపిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. అసలు విషయాలు మాత్రం దాటవేస్తున్నారు.