టీఆర్‌ఎస్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.

హైదరాబాద్:
కళాకారులను నేరుగా ఉద్యోగాల్లో నియామకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా 550 మంది కళాకారులను ఉద్యోగాల్లో నియమించిన కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. కావాల్సిన వారిని ఆ పోస్టుల్లో భర్తీ చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారి నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. తిరిగి ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా కళాకారులను ఉద్యోగాల్లో నియమించడాన్ని సవాల్ చేసిన కేసులో ఉమ్మడి హైకోర్టు తెలంగాణ సర్కార్‌కు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.తిరిగి ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని, మూడు వారాల్లో ఈ చర్యలు తీసుకుని హైకోర్టుకు తెలియజేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్.రాధాకృష్ణన్, న్యాయమూర్తి రమేష్ రంగనాథన్‌తో కూడిన డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఉద్యోగ భర్తీకి చెందిన సర్వీస్ రూల్స్ మేరకు తాజా నోటిఫికేషన్ ఉండాలని, సదరు పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఉండాలని, 550 మందిలో అర్హులు ఉంటే ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని డివిజన్ బెంచ్ గతంలోనే ఆదేశించింది.కళాకారుల ఎంపికకు, ప్రకటన జారీకి మూడు వారాల సమయం కావాలని తెలంగాణ సర్కార్ అనుబంధ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. అందుకు మంగళవారం డివిజన్ బెంచ్ అంగీకరిస్తూ.. తెలంగాణ సాంస్కృతిక, యువజన వ్యవహా రాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 550 మంది కళాకారులను ప్రభుత్వం నేరుగా ఉద్యోగ సర్వీసులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన జుకంటి రమేష్ మరో ఇద్దరు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇప్పటికే పలుసార్లు విచారించిన హైకోర్టు సోమవారం మరోసారి విచారించి తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చింది.2015లో తెలంగాణ ప్రభుత్వం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా 550 మంది కళాకారులను ఉద్యోగాల్లో నియమించిందని, వారికి ఒక్కొక్కరికి రూ.24,514 చొప్పున జీతం చెల్లిస్తోందని, సర్వీస్ రూల్స్ ప్రకారం నోటిఫికేషన్ వెల్లడించకుండా నేరుగా ఉద్యోగాల్లో నియమించడం చెల్లదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. నియామక పత్రాల ఫైళ్లు తమ ముందుంచాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. వీటిని పరిశీలించిన డివిజన్ బెంచ్.. మూడు వారాల్లోగా నోటిఫికేషన్ జారీ చేయాలని, పూర్తి వివరాలు తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ మూడు వారాలకు వాయిదాపడింది.