‘టెక్’ రంగంలోకి అడుగేసిన ప్రియాంక చోప్రా.

ముంబయి:
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడు తనలోని వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. నటన, గానం తర్వాత ఇప్పుడు పీసీ మరో సరికొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించింది. టెక్ స్టార్టప్ హోల్బర్టన్ స్కూల్ తో పాటు డేటింగ్, సోషల్ మీడియా యాప్ బంబుల్ లో పెట్టుబడులు పెట్టి వాణిజ్య రంగంలోకి అడుగు వేసింది. టెక్ ఇండస్ట్రీలో లైంగిక వివక్షతను మార్చేందుకే ఈ ప్రయత్నం అని పిగ్గీ చాప్స్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసి తెలిపింది. ఇది తనకో కొత్త అధ్యాయమం అని ప్రియాంక ట్వీటింది. బంబుల్, హోల్బర్టన్ స్కూల్ లో పెట్టుబడిదారుగా భాగస్వామ్యం తీసుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. ఒకేసారి రెండు టెక్ కంపెనీలతో కలిసి పనిచేయడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపింది. టెక్ రంగంలోని లైంగిక వివక్షతను తగ్గించేందుకు ప్రయత్నిస్తానంది.స్టార్టప్ ఇన్వెస్టర్ గా ప్రియాంకకు ఇది మొదటి ప్రాజెక్ట్. ఇటీవలే పీసీ తన కొత్త పోర్ట్ ఫోలియో కంపెనీ కోసం శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటించింది. హోల్బర్టన్ లో ఆమె 8.2 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి కంపెనీ సలహాదారుల బోర్డులో చేరింది. ఈ సంస్థ వెనుకబడిన నేపథ్యాలకు చెందిన ప్రజలను అక్షరాస్యులను చేయడానికి కృషి చేయనుంది. సమాజంపై అత్యధిక ప్రభావం చూపే కంపెనీలు, మహిళలు స్థాపించే కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలని గ్లోబల్ స్టార్ భావిస్తోంది. ప్రస్తుతానికైతే ఎన్ని కంపెనీల్లో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోనప్పటికీ తనకంటూ ఒక పోర్ట్ ఫోలియో నిర్మించుకొనే ప్రయత్నాల్లో ఉంది ప్రియాంక.