టోక్యో ఒలింపిక్స్ కు వేసవి సెగ.

టోక్యో:
టోక్యో ఒలింపిక్స్ కి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే విశ్వక్రీడా సంబరానికి వేసవి సెగ తగులుతోంది. 2020లో జపాన్ రాజధానిలో ఒలింపిక్స్ జరిగే సమయానికి ఎండలు చండప్రచండంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తుండటంతో నిర్వాహక కమిటీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది. ఒలింపిక్ గేమ్స్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు టోక్యోలో పర్యటించిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమన్వయ కమిషన్ చైర్మన్ జాన్ కోట్స్ టోక్యో ఒలింపిక్ కమిటీతో భేటీ అయ్యారు. 2020 జూలై 24 నుంచి ఆగస్ట్ 9 వరకు జరిగే ప్రపంచ క్రీడోత్సవాలకు వేసవి ఆటంకం కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ జరిగేటపుడు టోక్యోలో వాతావరణం 35 డిగ్రీలకు పైగా ఉండొచ్చన్న వాతావరణశాఖ నిపుణుల అంచనాలపై చర్చ జరిపారు. కొన్నేళ్లుగా టోక్యోలో ఎండలు పెరుగుతూ వస్తున్నాయి. ఒలింపిక్స్ సమయంలో వడగాడ్పులు తీవ్రంగా ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో అతి వేడిమిని ఎదుర్కొనేందుకు నిర్వాహక కమిటీ తగిన ఏర్పాట్లు చేయాలని కోట్స్ సూచించారు. అథ్లెట్లు సేద తీరేందుకు విశాలమైన ఎయిర్ కండిషన్డ్ ప్రదేశం నిర్మించాలని కోరారు. క్రీడాకారులతో పాటు ప్రేక్షకుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.జపాన్ ప్రభుత్వం, టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం తక్కువ వేడిని వెలువరించే పేవ్ మెంట్లు, రోడ్ల పక్కన భారీ వృక్షాలు వంటి చర్యలు ఇప్పటికే చేపట్టాయి. రోయింగ్, మారథాన్ వంటి క్రీడలను ఎండలు ముదరకుండా ఉదయం వీలైనంత త్వరగా నిర్వహించాలని నిర్ణయించాయి.